
బీజేపీ నేత మనోజ్ తివారీ
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ పౌరుల జాబితా (ఎన్‌ఆర్‌సీ) అంశంపై సీఎం కేజ్రీవాల్, బీజేపీ నేత మనోజ్ తివారీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఢిల్లీలో ఎన్‌ఆర్‌సీ అమలు చేస్తే మనోజ్ తివారీనే ముందుగా ఢిల్లీ వదిలిపోవాల్సి వస్తుందని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై తివారీ తాజాగా విరుచుకుపడ్డారు. ఇదే కేజ్రీవాల్ ఉద్దేశమైతే ఆయన మానసిక పరిస్థితి బాగోలేదని అనుకోవాల్సి వస్తుందని ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నారు. పూర్వాంచల్ నుంచి ఒక వ్యక్తి ఢిల్లీ వస్తే అతను చొరబాటుదారు అవుతారని, అతన్ని ఢిల్లీ నుంచి తరిమికొట్టాలని ఆయన చెప్పదలుచుకున్నారా? ఇతర రాష్ట్రాల నుంచి వలసవచ్చిన వారంతా విదేశీయులని ఆయన అభిప్రాయమా?. ఒక ఐఆర్‌ఎస్ అధికారిగా ఆయనకు ఎన్‌ఆర్‌సీ అంటే తెలియదా? అని తివారీ తీవ్ర స్థాయిలో సీఎంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ముందు తివారినే వెళ్లిపోవాలి
ఢిల్లీలో ఎన్‌ఆర్‌సీ అమలు చేయాలంటున్న ఢిల్లీ బీజేపీ చీఫ్ తివారీ అభిప్రాయంపై కేజ్రీవాల్‌ను మీడియా అడిగినప్పుడు ఆయన సూటిగా స్పందించారు. అదే జరిగితే ముందుగా ఢిల్లీని వదిలి పెట్టాల్సింది తివారీయేనని వ్యాఖ్యానించారు. జర్నలిస్టుపై దాడికి చొరబాటుదారులే కారణమని, ఢిల్లీలో ఎన్‌ఆర్‌సీ అమలు చేయాలని మనోజ్ తివారీ చెబుతున్నారని, ఎన్‌ఆర్‌సీ అమలు చేస్తే ముందుగా ఢిల్లీని వదిలి పెట్టాల్సింది ఆయనేనని అన్నారు. ఢిల్లీలో స్థిరపడిన అక్రమ వలసదారులతో ప్రమాదం ఉన్నందున ఢిల్లీలో ఎన్‌ఆర్‌సీ అవసరం ఎంతైనా ఉందని, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల పార్టీ మేనిఫెస్టేలో ఇది కూడా ఉండబోతోందని ఇటీవల తివారీ చెప్పారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
కాగా, కేజ్రీవాల్ తాజా వ్యాఖ్యలపై బీజేపీ నేత కపిల్ మిశ్రా ఘాటుగా స్పందించారు. సీఎం వ్యాఖ్యలు కలవరపెట్టే విధంగా ఉన్నాయని అన్నారు. ఢిల్లీలో ఎన్‌ఆర్‌సీ అమలు చేస్తే బీహార్, ఉత్తరప్రదేశ్ ప్రజలు ఢిల్లీ వదలిపెట్టాలని కేజ్రీవాల్ చెప్పడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఎన్‌ఆర్‌సీలో ‘ఎన్’ అంటే ‘జాతీయుడు’ (నేషనల్) అని అర్ధమని, కొందరికి ఇది అవగాహన కావడం లేదని కేజ్రీవాల్‌ను పరోక్షంగా విమర్శించారు.