వీడియోలో అశ్విని దృశ్యం
సాక్షి, తిరువనంతపురం : కేరళలో ఓ బాలిక వీడియో సంచలనంగా మారింది. సీపీఎం కార్యకర్తల మూలంగా తన కుటుంబానికి ముప్పు పొంచి ఉందని సదరు బాలిక ఓ వీడియోను రికార్డు చేసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. దీంతో రాజకీయంగా ఒక్కసారిగా పెను దుమారం చెలరేగింది.
కసరగాడ్ జిల్లాకు చెందిన సుకుమారన్ అనే వ్యక్తి మొన్నటి దాకా సీపీఎంలో కొనసాగారు. అయితే పార్టీలో సముచిత స్థానం దక్కకపోవటంతో ఈ మధ్యే బీజేపీలో చేరిపోయారు. తమకు మంచి పట్టు ఉన్న ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవటం.. సీపీఎం స్థానిక నేతలకు మంట పుట్టించింది. దీంతో వారు బెదిరింపులకు దిగారు. ఈ క్రమంలో గురువారం తన కూతురును స్కూల్ నుంచి తీసుకొస్తున్న క్రమంలో ఐదుగురు కార్యకర్తలు ఆయన్ని అడ్డగించారు. సుకుమారన్ కుటుంబాన్ని చంపుతామని బెదిరించారు. పోలీసులు కూడా తమనేం చేయలేరని.. ఎవరికీ భయపడే రకం తాము కాదని హెచ్చరించారు.
9వ తరగతి చదువుతున్న ఆయన కూతురు అశ్విని ఫేస్‌బుక్‌లో ఓ వీడియోను పోస్టు చేసింది. జరిగిందంతా పూస గుచ్చినట్లు వీడియోలో పేర్కొంది. స్కూల్‌కు వెళ్లాళ్లన్నా తనకు భయంగా ఉందని.. దొడ్డిదారిలో పాఠశాలకు వెళ్లాల్సి వస్తోందని ఆమె వివరించింది. ‘సీపీఎం కార్యకర్తలు నా తండ్రిని చంపేస్తారు.. నా కుటుంబాన్ని రక్షించండి’ అంటూ బాలిక వీడియోలో వేడుకుంది.
సీపీఎం స్పందన... అశ్విని చేసిన ఆరోపణలను సీపీఎం నేతలు ఖండిస్తున్నారు. ‘సీపీఎంలో అతనో సాధారణ కార్యకర్తగా వ్యవహరించేవాడు. తర్వాత కాంగ్రెస్‌లో చేరాడు. ఇప్పుడు బీజేపీలో చేరాడు. అంత చిన్న స్థాయి వ్యక్తిని బెదిరించాల్సిన అవసరం మాకు ఏంటి?. పబ్లిసిటీ కోసమే అతను ఇలాంటి పనులు చేస్తున్నాడు’ అని సీపీఎం కార్యదర్శి టీకే రవి వెల్లడించారు.
ఇక బీజేపీ నేతలు మాత్రం సుకుమారన్ బలమైన నేత అనే చెబుతోంది. తక్షణమే అతని కుటుంబానికి రక్షణ కల్పించి.. బెదిరింపుల వెనుక ఉంది ఎవరో కనిపెట్టాలని బీజేపీ ధర్నా చేపట్టింది. సుకుమారన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వీడియో విపరీతంగా చక్కర్లు కొడుతున్న క్రమంలో విషయం ముఖ్యమంత్రి పినరయి విజయన్ దాకా వెళ్లింది. దీంతో ఘటనపై ఆయన డీజీపీ నుంచి నివేదికను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment