సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వచ్చేనెల 3 నుంచి 7వరకు జరగాల్సిన సైన్స్ కాంగ్రెస్ సమావేశాలను వాయిదా వేసి ఓయూ ప్రతిష్టను దిగజార్చారని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి విమర్శించారు. తెలం గాణ కోసం పోరాడిన ఓయూపై ముఖ్యమంత్రి కేసీఆర్ కక్షగట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు ప్రధానమంత్రి హాజరుకావడం ఆనవాయితీ అని.. ప్రధాని ఓయూకు రావడం సీఎంకు ఇష్టంలేనందునే ఈ సమావేశాలను వాయిదా వేశారని ఆరోపించారు. 62 దేశాల ప్రతినిధులు, ఏడుగురు నోబెల్ గ్రహీతలు ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు పేర్లు నమోదు చేసుకున్నారని చెప్పారు. విమాన టికెట్లు, హోటళ్లు, కార్లు వంటివన్నీ బుక్ చేసుకున్నారని, వీటికోసం కోట్లాది రూపాయలను కూడా ఖర్చు పెట్టారన్నారు.
అవి టీఆర్‌ఎస్ మహాసభలు: తెలుగు మహాసభలు టీఆర్‌ఎస్ మహాసభల్లా జరిగాయని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తెలుగు భాషాభివృద్ధికి గాని, తెలుగు విశ్వవిద్యాలయానికిగాని ఒక్క రూపాయి అయినా కేటాయించారా అని ప్రశ్నించారు. దత్తాత్రేయను అవమానించే విధంగా మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని మాత్రమే వేదిక మీదకు ఆహ్వానించారని ఈ సభల్లో తెలంగాణ కవులు, కళాకారులకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment