సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కోసం పోరాడిన ఉస్మానియా యూనివర్సిటీపై ముఖ్యమంత్రి కేసీఆర్ కక్షగట్టినట్టుగా వ్యవహరిస్తున్నాడని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం నాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ..జనవరి 3 నుంచి 7 దాకా జరగాల్సిన సైన్స్ కాంగ్రెస్ వాయిదా వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు ప్రధానమంత్రి హాజరుకావడం ఆనవాయితీ అని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒత్తిడి వల్లనే ఈ సమావేశాలను వాయిదా వేశారని ఆరోపించారు.
ప్రపంచవ్యాప్తంగా 62 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు, నోబెల్ బహుమతులు పొందిన వారు ఏడుగురు ఈ సమావేశాలకు హాజరు అవుతామని నమోదు చేసుకున్నారని చెప్పారు. విమాన ప్రయాణపు టికెట్లు, హోటళ్లు, కార్లు వంటివన్నీ బుక్ చేసుకున్నారని, వీటికోసం కోట్లాది రూపాయలు ఖర్చు కూడా చేశారని అన్నారు. ఏకపక్షంగా రద్దుచేయడం ద్వారా ఓయూ ప్రతిష్ఠను దెబ్బతీసేవిధంగా వ్యవహరిస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీ, ప్రధాని రాష్ట్రానికి రావడం ఇష్ఠం లేనందుకే సీఎం కేసీఆర్‌కు ఇష్ఠంలేదని ఆరోపించారు. ఇది తెలంగాణకు అవమానమన్నారు. దీనికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు.
లక్ష్యం లేకుండానే తెలుగు మహా సభలు సొంత డబ్బాకోసం నిర్వహించారని, రాచరిక పాలనకు తెలుగు మహాసభ వేదిక అయిందని ఆరోపించారు. తెలుగు విశ్వవిద్యాలయానికి ఏమైనా ప్రోత్సాహకాలు ప్రకటించారా, తెలుగు భాషాభివృద్ధికి ఒక్క రూపాయి అయినా కేటాయించారా అని ప్రశ్నించారు. తెలుగు మహాసభలు టీఆర్‌ఎస్ మహాసభల్లా జరిగాయన్నారు. మాజీ కేంద్రమంత్రి దత్తాత్రేయను అవమానించే విధంగా వేదిక మీదకు ఆహ్వానించకుండా, మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వేదిక మీదకు పిలిచారని అన్నారు. ఇవేమి తెలుగుసభలో అర్థం కావడంలేదన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన కవులు, కళాకారులకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment