
ఏపీ సచివాలయంలో నవరత్నాల వాల్ పెయింట్స్
సాక్షి, అమరావతి : ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటు తన పాలనలో వైవిధ్యం కనబరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. మేనిఫెస్టోనే తనకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని తెలిపిన విషయం తెలిసిందే. మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని తప్పకుండా అమలు చేస్తామని ఇప్పటికే వైఎస్ జగన్ పలుమార్లు స్పష్టం చేశారు. శనివారం తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో సచివాలయానికి వచ్చిన ఆయన ఉద్యోగులకు వరాల జల్లు కురిపించారు. 27 శాతం ఐఆర్‌ను ప్రకటించడంతో పాటు సీపీఎస్ రద్దుపై ఆదివారం జరిగే మంత్రవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. తన సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన హామీలు.. మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను అమలు పర్చేవిధంగా అడుగులు వేస్తున్నారు. సామాజిక సమతూల్యత పాటిస్తూ బడుగు బలహీనవర్గాలకు పెద్దపీట వేస్తూ 25 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు.
అయితే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రస్తావించిన నవరత్నాలకు సంబంధించిన వాల్ పెయింట్స్‌ను సీఎం వైఎస్ జగన్ సచివాలయంలో పెట్టించారు. 1.ఆరోగ్యశ్రీ 2. వైఎస్సార్ రైతు భరోసా 3. అమ్మ ఒడి 4. ఫీజు రీయింబర్స్‌మెంట్ 5. వైఎస్సార్ ఆసరా ఫించన్లు 6. డ్వాక్రా రుణాలు 7. పక్కాఇళ్లు 8. మద్య నిషేధం 9. జలయజ్ఞం వంటి వాల్‌పెయింట్స్‌ను వరుసగా ఏర్పాటు చేయించారు. ఈ విషయాన్ని మంత్రి కొడాలి నాని తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. ‘మ్యానిఫెస్టోను తూచ తప్పకుండ అమలు చేస్తానని చెప్తూ ఇలా సచివాలయంలో గోడల మీద వేయించిన ఏకైక సీఎం వైయస్ జగన్’ అని కొనియాడారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇక ఇప్పటికే వైఎస్సార్ ఆసరా ఫించన్లపై తొలి సంతకం చేసిన వైఎస్ జగన్.. వైఎస్సార్ రైతు భరోసా అమలు దిశగా అడుగులు వేశారు. వ్యవసాయం, అనుబంధ రంగాల అధికారులతో తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి రైతు కుటుంబం చేతికి నేరుగా రూ. 12,500లు పెట్టుబడి సహాయం అందించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ రైతు భరోసా కింద రూ. 13,125 కోట్లు రైతులకు ప్రభుత్వం అందించనుంది. సమీక్ష సందర్భంగా రైతులకు ఏమేం చేయాలో అధికారులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.
మ్యానిఫెస్టోను తూచ తపకుండ అమలు చేస్తానని చెప్తూ ఇలా సచివాలయంలో గోడల మీద వేయించిన ఏకైక సీఎం వైయస్ జగన్@ysjagan #APCMYSJagan #YSJagan #ThatIsJagan pic.twitter.com/hxnhwL0WpV
— Kodali Nani (@IamKodaliNani) June 8, 2019
Comments
Please login to add a commentAdd a comment