
సాక్షి, హైదరాబాద్ : బతుకు దెరువు తెలంగాణ కావాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఆదివారం సరూర్‌నగర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన తెలంగాణ జనసమితి పార్టీ ఆవిర్భావ సభలో ఆయన తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బతుకు దెరువు కోసం తెలంగాణ కావాలని, కొందరి తెలంగాణ కాకుండా అందరి తెలంగాణ కావాలన్నారు. ప్రస్తుత పాలకులు ఉద్యమ ఆకాంక్షలను అటకెక్కించారని, పాలకుల మార్పు కాకుండా.. పాలనలో మార్పు రావాలన్నారు. ప్రజలు కేంద్రంగా గల తెలంగాణ కావాలని, తెలంగాణ జనసమితి ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తుందని స్పష్టం చేశారు.
తెలంగాణ జన సమితి అధ్యక్షుడిగా కోదండరాం పేరును ఆ పార్టీ నేతలు చంద్రశేఖర్, జీపీ రెడ్డిలు ప్రతిపాదించగా.. ఆయన ఎన్నికను నేతలు, కార్యకర్తలు ఆమోదించారు. ఈ వేదికపై తొలివరుసలో అన్ని తెలంగాణ విశ్వవిద్యాలయాల విద్యార్థులు, తెలంగాణ కోసం ఆత్మత్యాగం చేసుకున్న అమరుల కుటుంబసభ్యులు, బలవన్మరణాలకు పాల్పడిన రైతుల కుటుంబసభ్యులు కూర్చున్నారు. ఈ ఆవిర్భావ సభకు విద్యార్థులు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఫ్రోఫెసర్ హరగోపాల్ సైతం హాజరయ్యారు.