హైదరాబాద్ : తాము అధికారంలోకి రాగానే ప్రస్తుత ప్రభుత్వంలో ఇప్పటివరకు జరిగిన అవినీతిపై న్యాయ విచారణ చేయిస్తామని తెలంగాణ జనసమితి (టీజేఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. రాష్ట్రంలో రాజకీయాలు మారాలని, అందరికీ విద్య, వైద్యం ఇవ్వాలని ఇవన్నీ చేయడం ఈ ప్రభుత్వంవల్ల కాదని ఆయన స్పష్టంచేశారు. శుక్రవారం ఎర్రమంజిల్‌లోని హోటల్ ఎన్‌కేఎం గ్రాండ్‌లో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కోదండరామ్‌తో మీట్ ది ప్రెస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు కోదండరామ్ సమాధానం చెప్పారు..వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు.
తాము 14 ఏళ్లుగా ప్రజలతో కలసి పోరాటం చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో కుటుంబ పాలన సాగుతోందనీ, పూర్తిస్థాయిలో నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆగ్రహంవ్యక్తం చేశారు. ఉద్యమ ఆకాంక్ష ఒక్కటీ నెరవేరడంలేదన్నారు. మూడు నెలలనుండీ ఆసరా పింఛన్ ఇవ్వలేదని, ఉపాధి హామీ డబ్బులు కేంద్రం ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంలేదని, ప్రశ్నించే వారిని అణగదొక్కుతున్నారని ప్రజలు గగ్గోలు పెడుతున్నారన్నారు. తమ పార్టీని గ్రామస్థాయి నుంచీ పటిష్టం చేస్తున్నామన్నారు. ఇప్పటికే విద్యార్ధి, యువజన, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విభాగాలు ఏర్పాటు చేశామని, ఆరోగ్యం, విద్యపై వివిధ సదస్సులు జరిపి చాలా విషయాలపై అవగాహన పెంచుకున్నట్లు తెలిపారు.
తాము అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటించి తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు భర్తీచేస్తామన్నారు. నిరుద్యోగులందరికీ 2,500 నిరుద్యోగ భృతి కల్పిస్తామన్నారు. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తామన్నారు. మహిళా సంఘాలకు పావలా వడ్డీ, ఆసరా పింఛన్ 1,500, వికలాంగులకు 2వేలు పింఛన్ ఇస్తామన్నారు. బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు నెలకు సరిపడా మందులు ఉచితంగా అందిస్తామన్నారు. నాణ్యమైన ప్రభుత్వ విద్యను అందిస్తామని, అన్ని విద్యాసంస్థల్లో ఖాళీలు భర్తీ చేసి, అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment