సాక్షి, హైదరాబాద్: ట్యాంక్‌బండ్‌పై నేడు (శనివారం) తలపెట్టిన మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభ తీవ్ర ఉద్రిక్తతలు రేపుతోంది. తెలంగాణ జేఏసీ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ సభకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ.. ఎట్టిపరిస్థితుల్లో నిర్వహించేందుకు ఆయా పక్షాల నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ సభలో పాల్గొనేందుకు జేఏసీ చైర్మన్ కోదండరామ్ సిద్ధమవుతుండగా.. ఆయన ఇంటి నుంచి బయటకు రాగానే అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. మరోవైపు పెద్ద ఎత్తున జేఏసీ నేతలు ఒక్కొక్కరుగా కోదండరాం ఇంటికి చేరుకుంటున్నారు.
కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో ఇన్ని నిర్బంధాలా?
ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్ స్పూర్తి సభకు అనుమతి ఇవ్వకపోవటంపై కోదండరాం తీవ్రంగా మండిపడ్డారు. ఇది నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. ఆయన శనివారం ఉదయం మీడియాతో మాట్లాడారు. నాటి మిలియన్ మార్చ్ జ్ఞాపకాలు ఇంకా కళ్ళముందు కదులుతున్నాయని, నాడు ప్రజలు ఉవ్వెత్తున తరలివచ్చి విజయవంతం చేశారని గుర్తుచేసుకున్నారు. 2011లో ఎన్ని ఆంక్షలు ఉన్నా.. మిలియన్ మార్చ్‌ను విజయవంతం చేసుకున్నామన్నారు. ‘ప్రస్తుతం తెలంగాణాలో సమస్యలు చాలా ఉన్నాయ్. నిరుద్యోగం, రైతు సంక్షోభం నెలకొంది. ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో అసంతృప్తి నెలకొంది’ అని అన్నారు.
మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభను ఇంతకాలం ప్రభుత్వం నిర్వహిస్తుందేమోనని ఎదురుచూశామని, కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో ఇన్ని నిర్బంధాలు ఉంటాయనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమతోపాటు తెలంగాణ ఇంటి పార్టీ , సీపీఐ, న్యూడెమోక్రసి, టీపీఎఫ్, అరుణోదయ సంస్థ , విద్యాసంఘాల నేతలు స్పూర్తి సభకు తరలి వస్తున్నారని తెలిపారు. ఇప్పటికే అన్నివర్గాల వారు వేలాదిగా మిలియన్ మార్చ్ స్పూర్తి సభకు హైదరాబాద్ తరలి వస్తున్నారని చెప్పారు. జిల్లాల్లో హైదరాబాద్‌లో ఎన్ని అక్రమ అరెస్టు చేసినా, నిర్బందాలు విధించినా స్పూర్తి సభ విజయవంతం అవుతుందనే నమ్మకం తనుకందన్నారు.
మరోవైపు మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభ నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌కు దారితీసే మార్గాలన్నింటినీ ముళ్లకంచెలతో మూసివేశారు. ఇందిరాపార్కు సమీపంలోని కట్ట మైసమ్మ టెంపుల్ వద్ద నుంచి మెట్ల ద్వారా పైకి వెళ్లే మార్గాన్ని పూర్తిగా మూసివేశారు. గోశాల వద్ద కూడా ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఘాట్ వద్ద రోడ్డు మూసివేసి లోయర్ ట్యాంక్‌బండ్ మీదుగా రాకపోకలను నియంత్రించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. శనివారం ఉదయం నుంచి ట్యాంక్‌బండ్‌పై రాకపోకలను పూర్తిగా నియంత్రించనున్నట్లు పోలీసులు తెలిపారు. అటు సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment