పోలీసు ఆంక్షల నేపథ్యంలో నిర్మానుష్యంగా మారిన ట్యాంక్‌బండ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపునిచ్చిన ‘మిలియన్ మార్చ్’ను, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తు చేసుకోవడానికి.. తెలంగాణ జేఏసీ చేపట్టిన మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభను పోలీసులు భగ్నం చేశారు. శనివారం ఉదయం నుంచే ట్యాంక్‌బండ్‌ను, పరిసర ప్రాంతాలను పూర్తిగా స్వాధీనంలోకి తీసుకున్నారు. సాయంత్రం వరకు వాహనాల రాకపోకలను కూడా నిషేధించారు. టీజేఏసీ చైర్మన్ కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్‌లతోపాటు టీజేఏసీ నాయకులు, కార్యకర్తలు, సీపీఐ, న్యూడెమోక్రసీ, అరుణోదయ, పీవోడబ్ల్యూ, తదితర వామపక్ష ప్రజాసంఘాలకు చెందిన వందలాది మంది నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభకు తరలివస్తున్న వారిని హైదరాబాద్ శివార్లలోనే అదుపులోకి తీసుకున్నారు.
ముళ్ల కంచెలు.. బారికేడ్లు..
మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడం, అయినా సభ జరిపి తీరుతామని టీజేఏసీ, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, తెలంగాణ ప్రజాఫ్రంట్, అరుణో దయ తదితర పార్టీలు, ప్రజాసంఘాలు ప్రకటించడంతో పోలీసులు భారీగా మోహరించారు. ట్యాంక్‌బండ్‌పైకి ఎవరూ వెళ్లకుండా మార్గాలన్నింటినీ మూసేశారు. అన్ని చోట్లా ఇనుప కంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్‌కు ఇరువైపులా లిబర్టీ, ఇందిరాపార్కు, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం తదితర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
దూసుకొచ్చిన ఉద్యమకారులు
పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినా.. పలువురు టీజేఏసీ నాయకులు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు, పీవోడబ్ల్యూ సంధ్య, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి అనురాధ, పీవోడబ్ల్యూ నగర అధ్యక్షురాలు సరళ తదితరులు ట్యాంక్‌బండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వరకు చేరుకున్నారు. అది గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో తీవ్రస్థాయిలో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. ఇదే సమయంలో మరోవైపు నుంచి పీడీఎస్‌యు విద్యార్థులు ట్యాంక్‌బండ్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారందరినీ అరెస్టు చేసి వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. టీజేఏసీ హైదరాబాద్ అధ్యక్షుడు సత్యంగౌడ్, న్యూడెమోక్రసీ రాయల వర్గానికి చెందిన రాష్ట్ర నాయకురాలు రమ, ఎస్‌ఎల్ పద్మ, అరుణ తదితరులను తెలుగు తల్లి విగ్రహం వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఇక టీజేఏసీ మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభకు మద్దతు ప్రకటించిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను పోలీసులు గృహనిర్బంధం చేశారు. అక్కడికి వచ్చిన ఎమ్మార్పీఎస్, ఇతర ప్రజా సంఘాల నేతలను అరెస్టు చేశారు.
కోదండరాం నివాసం వద్ద హైడ్రామా
టీజేఏసీ మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో.. పోలీసులు శుక్రవారం రాత్రి నుంచే టీజేఏసీ చైర్మన్ కోదండరాం ఇంటిని చుట్టుముట్టారు. పరిసర ప్రాంతాల్లో మోహరించారు. కోదండరాంను కలసి స్ఫూర్తి సభకు వెళ్లేందుకు అక్కడికి వచ్చిన జేఏసీ నాయకులు, విద్యార్థి నాయకులను అరెస్టు చేశారు. ఇక మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో కోదండరాంను అరెస్టు చేసేందుకు హైడ్రామా నడిపించారు. కోదండరాం నివాసం పక్కనే ఉన్న మరో ఇంట్లోకి వెళ్లిన పోలీసులు.. అక్కడి నుంచి కోదండరాం ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో పోలీసులను దారి మళ్లించేందుకు టీజేఏసీ కార్యకర్త ఒకరు కోదండరాం ఇంటి ప్రహరీ గోడ దూకి వెళుతున్నట్టుగా పారిపోయారు. అది చూసి హైరానా పడిన పోలీసులు.. ఆయనను పట్టుకునేందుకు పరుగులు తీశారు. అయితే పోలీసుల తీరుపై మండిపడిన కోదండరాం.. పలువురు జేఏసీ నాయకులతో కలసి తన ఇంటికి తాళం వేసుకుని స్వీయ నిర్బంధం ప్రకటించుకున్నారు. కానీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంట్లోంచి బయటకు రావడంతో అరెస్టు చేశారు.
నిరంకుశ పాలనకు నిదర్శనమిది
టీజేఏసీ చైర్మన్ కోదండరాం
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని టీజేఏసీ చైర్మన్ కోదండరాం మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అప్రజాస్వామికంగా నిర్బంధిస్తూ, అరెస్టులు చేస్తున్నారని పేర్కొన్నారు. పాలకుల వైఖరిని కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పారు. కోదండరాం అరెస్టుకు ముందు తన నివాసంలో, అరెస్టు తర్వాత బొల్లారం పోలీస్‌స్టేషన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మేమే తెలంగాణ తెచ్చినం, మా ఇష్టమున్నట్టుగా పాలన సాగిస్తాం..అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలపై ఇంత నిర్బంధమా.? 2011లో ఎన్ని ఆంక్షలున్నా మిలియన్ మార్చ్‌ను విజయవంతం చేశాం. తెలంగాణ వచ్చాక ప్రభుత్వమే మిలియన్ మార్చ్ స్ఫూర్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఇంతకాలం ఎదురుచూశాం. ఆ దిశగా ప్రభుత్వం స్పందించకపోవడంతోనే.. మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభను ఏర్పాటు చేశాం. కానీ ప్రభుత్వం ఈ స్ఫూర్తి సభకు అనుమతి నిరాకరించడం నిరంకుశ పాలనకు నిదర్శనం..’’అని కోదండరాం మండిపడ్డారు. మిలియన్ మార్చ్ స్ఫూర్తి çసభ సీఎం కేసీఆర్‌కు ఇష్టం లేదని, అందుకే రెండు రోజుల నుంచి ముందస్తు అరెస్టులు చేశారని చెప్పారు. వేల మంది నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారని.. అప్రజాస్వామికంగా కొనసాగుతున్న అరెస్టులపై కోర్టును ఆశ్రయిస్తామని, పాలకుల వైఖరిని కోర్టులోనే తేల్చుకుంటామని తెలిపారు.
మాకూ అలాంటి స్వేచ్ఛ ఉంది
సీఎం కేసీఆర్ తొలి నుంచీ తనను ప్రశ్నించే వారిపట్ల నిరంకుశ వైఖరిని ప్రదర్శిస్తున్నారని కోదండరాం ఆరోపించారు. రాష్ట్ర సమస్యలపై ఢిల్లీలో ధర్నా చేసేందుకు ముఖ్యమంత్రికి ఎలాంటి స్వేచ్ఛ ఉందో.. స్ఫూర్తి సభలో పాల్గొనేందుకు తమకు కూడా అలాంటి స్వేచ్ఛ ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబించడం సరికాదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తు చేయడానికి తాము తలపెట్టిన స్ఫూర్తి సభ విజయవంతమైందన్నారు. 2011లో తనను అరెస్టు చేసి బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారని, ఇప్పుడూ అక్కడికే తీసుకొచ్చారని గుర్తు చేసుకున్నారు.
నియంత పాలన: చాడ
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. మిలియన్ మార్చ్ స్ఫూర్తి కార్యక్రమంలో పాల్గొనేందుకు ట్యాంక్‌బండ్‌కు బయలుదేరిన ఆయనను.. పార్టీ కార్యాలయం మగ్దూంభవన్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని.. అక్రమ అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ఈ నిర్బంధాలతో ఏం సాధిస్తారని కేసీఆర్‌ను ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది సీపీఐ కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేశారని.. వారికి రాత్రి నుంచి తిండి కూడా పెట్టకుండా బాధ పెట్టారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అవసరమైన సీపీఐ నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు అవసరం లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్బంధం విధించినా.. నైతికంగా సీపీఐ టీజేఏసీలే గెలిచాయన్నారు.
నన్నెందుకు అరెస్టు చేశారు?
పోలీసులను నిలదీసిన సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ
శనివారం మగ్దూంభవన్ వద్ద సీపీఐ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఏదో పని నిమిత్తం కార్యాలయానికి వచ్చిన సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను కూడా అరెస్టు చేశారు. దీంతో ఆయన పోలీసులను నిలదీశారు. ‘‘మా పార్టీ ఉమ్మడి కార్యాలయం ఇక్కడే ఉంది. ఓ పని నిమిత్తం నేను ఇక్కడికి వచ్చాను. నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు..’’అని రామకృష్ణ ప్రశ్నించారు. ప్రజల ఆకాంక్షలతో వచ్చిన తెలంగాణలో పోలీసు నిర్బంధం ఇంతగా ఉండడం విచారకరమని వ్యాఖ్యానించారు. కాగా.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కల్పించాలంటూ పెద్ద ఉద్యమం జరుగుతోందని.. దేశంలోని పలు పార్టీలు కూడా మద్దతిస్తున్నాయని రామకృష్ణ తెలిపారు. టీడీపీ ఎన్డీయేతో ఉన్న బంధాన్ని పూర్తిగా తెంచుకుని బయటకు వచ్చి.. హోదాపై పోరాటం చేయాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment