సాక్షి, హైదరాబాద్: తన తప్పులు, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే సీఎం చంద్రబాబు శ్వేతపత్రాల డ్రామా మొదలెట్టారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. ఆయన మాటలు చూస్తుంటే.. అధికారం కోల్పోతున్నామనే భయం పట్టిన్నట్లుగా ఉందన్నారు. అందుకే పండుగలు, పబ్బాలు లేకుండా శ్వేతపత్రాల పేరుతో ఇష్టానుసారంగా పేజీలకుపేజీలు అబద్ధాలు తీసుకొచ్చి కుమ్మరిస్తున్నారని దుయ్యబట్టారు. మంగళవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేతను విమర్శించడం.. లేదంటే ఎవరో ఒకరి కాళ్లు పట్టుకుని మళ్లీ అధికారంలోకి ఎలా రావాలనే ఆలోచన తప్ప చంద్రబాబు చేస్తుందేమీ లేదన్నారు. లోకేశ్‌పై ఉన్న కోపాన్ని చంద్రబాబు బహుశా వైఎస్ జగన్‌పై చూపిస్తున్నట్లుగా ఉందని పార్థసారథి అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు అంటున్నట్లుగా లోకేశ్ ఏ పంచాయతీ పదవుల్లో లేరని.. మరి ఆయన్ని నేరుగా ఎలా మంత్రిని చేశారని ప్రశ్నించారు. ఏదో డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నట్లు అర్థశాస్త్రమంతా తనకే తెలుసునని చంద్రబాబు మాట్లాడుతున్నారని.. మరి అంత తెలిసుంటే ప్రతి నెలాఖరుకు రిజర్వ్ బ్యాంకు వద్దకు వెళ్లి ఓడీ తీసుకుని జీతాలు చెల్లించాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు.
ఏ ముఖ్యమంత్రి హయాంలో కూడా ఇంత రెవెన్యూ లోటు చూడలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి రూ.90 వేల కోట్ల నష్టం జరిగిందని చంద్రబాబు ఇప్పుడు చెబుతున్నారని.. మరి నాలుగేళ్లుగా ఎన్డీయేతో కలిసి ఉన్నపుడు ఈ విషయంపై ఎందుకు ప్రశ్నించలేదని పార్థసారథి ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వద్దని, ప్యాకేజీ కావాలని కేంద్రంతో లాలూచీ పడిందే చంద్రబాబు అని ఎండగట్టారు. ప్యాకేజీని ఆహ్వానిస్తూ మోదీని అభినందిస్తూ తీర్మానం ఎందుకు చేశారో చెప్పాలన్నారు. చంద్రబాబు చెబుతున్నట్లుగా రైతుల ఆదాయం రెట్టింపైతే.. మరి ప్రతిరోజూ గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే వార్తలు ఎందుకొస్తున్నాయని నిలదీశారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.వెయ్యి నుంచి రూ.1,100కు అమ్మిన ధాన్యం.. ఇన్నేళ్ల తర్వాత ఇంకా రూ.1,300కు అతి కష్టం మీద అమ్ముతుండే రైతుల ఆదాయం ఎలా రెట్టింపయ్యిందని ప్రశ్నించారు. అలాగే చెరుకుకు 2014లో రూ.1,700 నుంచి రూ.1,800 ధర లభిస్తే ఇవాళ రూ.2వేల నుంచి రూ.2,100 మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. వైఎస్సార్ హయాంలో మాత్రమే నూరు శాతం రుణమాఫీ జరిగిన విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందేనన్నారు. చంద్రబాబులా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేయడం జగన్‌కు తెలియదన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు సోషియాలజీ, అర్ధశాస్త్రం తెలియడం వల్లే అమ్మ ఒడి పథకం తెస్తున్నారని, 108, 104 సర్వీసులను పకడ్బందీగా నిర్వహించడంతో పాటు రూ.వెయ్యి ఖర్చు దాటితే ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేరుస్తానని ప్రకటించారన్నారు.
తప్పులు కప్పిపుచ్చుకునేందుకే శ్వేతపత్రాల డ్రామా
Published Wed, Dec 26 2018 4:33 AM | Last Updated on Wed, Dec 26 2018 4:33 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment