సాక్షి, హైదరాబాద్: ‘కేజీ టు పీజీ పథకంలో భాగంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ వాటికి సొంత భవనాలుండవు. అధ్యాపకులు సమ్మెలో ఉంటే వారి సమస్య పరిష్కరించరు. అంతా గందరగోళం. పాత హాస్టళ్లను పూర్తిగా గాలికొదిలేశారు. వాటిల్లో టాయిలెట్లు సరిగాలేవు. ఉస్మానియా హాస్టల్‌లో విద్యార్థులు చెట్ల కింద స్నానం చేస్తున్నారు. నల్లగొండలో ఓ హాస్టల్ విద్యార్థి టాయిలెట్ లేక ఆరుబయటకు వెళ్లి కెనాల్‌లో పడి చనిపోయాడు. ఇంతకంటే దారుణమేమన్నా ఉంటుందా. ఇలాంటి దుస్థితికి సిగ్గుపడాలి’అంటూ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలలపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో కాంగ్రెస్ పార్టీ పక్షాన కోమటిరెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతనే లేదని తీవ్రంగా విమర్శించారు.
గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నా రెగ్యులర్ సిబ్బంది లేరని, సొంత భవనాలూ లేవని, తన వెంట వస్తే వాస్తవాలు కళ్లకుకట్టేలా చూపిస్తానని చెప్పారు. తన నియోజకవర్గంలోని బాలికల హాస్టల్‌లో చిన్న హాలులో 25 మంది ఉన్నారని, వారికి ఇరుకైన ఒకే టాయిలెట్ ఉందని, ఫ్యాన్లు, లైట్లు లేవని.. ఇదేమని కలెక్టర్‌ను అడిగితే బడ్జెట్ లేదని చెప్పారని కోమటిరెడ్డి సభ దృష్టికి తెచ్చారు. కలెక్టర్ సాయంతో వాటిల్లో ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేయించినట్లు పేర్కొన్నారు. ‘మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారు’ అని అధికారపక్ష సభ్యుల నుంచి ప్రశ్న రావటంతో.. సమైక్య రాష్ట్రంలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని నిధులు అడిగినా ఇవ్వకపోతే మంత్రి పదవిని కూడా వదులుకున్నానన్నారు. మూడున్నరేళ్లు గడిచినా అవే సమస్యలు వేధిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఉస్మానియాకు రూ.100 కోట్లేవి?
గురుకుల పాఠశాలల ఏర్పాటు మంచి పథకమని, దశలవారీగా అన్ని వసతులతో వాటిని ప్రారంభించాలని కోమటిరెడ్డి సూచించారు. హాస్టళ్లలో సన్న బియ్యం పెడితే సరిపోతుందా అని ప్రశ్నించిన కోమటిరెడ్డి.. కొత్త సచివాలయానికి ఖర్చు చేసే రూ.500 కోట్లతో పాత, కొత్త హాస్టళ్లన్నింటికీ మంచి భవనాలు, వసతులు ఏర్పాటవుతాయన్నారు. పాత హాస్టళ్లను తొలగించాల్సిన పనిలేదని, వాటిని వదులుకునేందుకు విద్యార్థులూ సిద్ధంగా లేరని, వసతులు కల్పిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. ఉస్మానియా వర్సిటీకి రూ.వంద కోట్లు కేటాయిస్తానని శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సీఎం హామీ ఇచ్చారని, ఆ నిధులేమయ్యా యని ప్రశ్నించారు. ఇప్పటికైనా దీనిపై సీఎం సమీక్షించి రూ.1,000 కోట్లు కేటాయిస్తే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. కాగా గురుకులాలు, పాత హాస్టళ్లపై అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడం తో కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment