
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ దంపతుల రాజకీయ ప్రయాణంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మంగళవారం ఉదయం 11.45 గంటలకు హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో వీరు విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నారు. సురేఖ టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం నేపథ్యంలో ఈ సమావేశంపై ఆసక్తి పెరుగుతోంది. 2014 ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌లో చేరినప్పటి నుంచి ముందస్తు ఎన్నికల అభ్యర్థుల జాబితా వరకు టీఆర్‌ఎస్ అధిష్టానం తమ విషయంలో వ్యవహరించిన తీరుపై ఈ సమావేశంలో వీరు వివరించనున్నారు. ఏడాదిగా తమ కుటుంబం విషయంలో టీఆర్‌ఎస్ ముఖ్యనేతలు వ్యవహరించిన తీరును ఈ సందర్భంగా తెలియజేయనున్నారు. రాజకీయ భవిష్యత్తుపై ప్రకటన చేసే అవకాశముంది.
టీఆర్‌ఎస్ అభ్యర్థుల తొలి జాబితాలో కొండా సురేఖకు చోటు (వరంగల్ తూర్పు) లభించకపోవడంతో తన భర్త, ఎమ్మెల్సీ మురళీధర్‌రావుతో కలసి ఈ నెల 8న విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేటీఆరే తన టికెట్‌ను అడ్డుకున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు టికెట్ కేటాయించకపోవడానికి రెండు రోజుల్లో కారణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. వినాయక చవితి నేపథ్యంలో ఇన్నాళ్లూ వేచి చూసినా టీఆర్‌ఎస్ పెద్దల నుంచి మాత్రం స్పందన రాలేదు. దీంతో కొండా దంపతులు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఆ పార్టీ తరుపున వరంగల్ తూర్పు, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లో రెండు చోట్ల పోటీ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం తరుపున వీరికి హామీ లభించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment