![konda Vishweshwar Reddy wanted CPI support - Sakshi](/styles/webp/s3/article_images/2019/04/2/KONDA-16.jpg.webp?itok=-qvxjxTi)
సాక్షి, హైదరాబాద్: చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గంలో తనకు మద్దతునివ్వాలని సీపీఐని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కోరారు. తన గెలుపునకు సీపీఐ పార్టీ శ్రేణులు సహాయ, సహకారాలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సోమవారం మఖ్దూంభవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఆ పార్టీ నేతలు అజీజ్ పాషా, పల్లా వెంకటరెడ్డిలతో విశ్వేశ్వరరెడ్డి సమావేశమయ్యారు. చేవెళ్ల స్థానంలో టీఆర్‌ఎస్, బీజేపీలను ఓడించేందుకు సహకారాన్ని అందించాలని ఈ సందర్భంగా కోరారు. తమ పార్టీలో చర్చించుకుని నిర్ణయాన్ని వెల్లడిస్తామని విశ్వేశ్వర్‌రెడ్డికి సీపీఐ నాయకులు చెప్పినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే మల్కాజిగిరి, కరీంనగర్, మహబూబ్‌నగర్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు సీపీఐ మద్దతు ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్న అంజన్‌కుమార్‌యాదవ్ కూడా సీపీఐ మద్దతు కోరిన విషయం తెలిసిందే. అయితే కేరళలోని వయనాడ్‌లో సీపీఐ పోటీ చేస్తున్న స్థానంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పోటీ చేయాలని తాజాగా నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రంలో మిగతా చోట్ల కాంగ్రెస్‌కు మద్దతు విషయమై సీపీఐ పునరాలోచనలో పడింది. ఇకపై కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతునివ్వరాదనే నిర్ణయానికి వచ్చినట్టుగా సీపీఐ నేతలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment