సాక్షి, అమరావతి: ఎన్నికల వేళ అధికార తెలుగుదేశం పార్టీలో ముఠా కుమ్ములాటలు తీవ్రమయ్యాయి. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్దే తెలుగు తమ్ముళ్లు పరస్పరం ఘర్షణకు దిగారు. అరుపులు, కేకలతో తన్నులాటకు దిగగా.. ఈ ఘర్షణలో పలువురికి స్వల్ప గాయాలైనట్టు సమాచారం. శుక్రవారం ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెంట్లలో పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు, నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకుల సమావేశాలు జరిగాయి. ఈ నేపథ్యంలో కొవ్వూరు, నిడదవోలు సిట్టింగ్ ఎమ్మెల్యేలైన కేఎస్ జవహర్, బూరుగుపల్లి శేషారావులకు సీట్లు ఇవ్వొద్దని అక్కడి క్యాడర్, స్థానిక నాయకత్వం ఆందోళనకు దిగింది.
నిడదవోలు నియోజకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే అనుకూల, వ్యతిరేక వర్గాల నాయకులు ఒకరిపై ఒకరు దాడి చేసి కొట్టుకున్నట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు సీటిస్తే టీడీపీ గోదారిలో కలిసిపోయినట్లేనంటూ ఆయన్ను వ్యతిరేకించే నాయకులు ఆందోళనకు దిగారు. రెండు వర్గాల నాయకులు అరుపులు, కేకలతో తన్నులాటకు దిగగా.. పలువురు నేతలకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఇసుక క్వారీల్లో బూరుగుపల్లి తీవ్ర అవినీతికి పాల్పడ్డారని, గ్రామాల్లో తమను పట్టించుకోకుండా అణచివేశారని పలువురు ఆరోపించారు. సమావేశానంతరం వారంతా టెంట్లనుంచి బయటికొచ్చి బూరుగుపల్లికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. వారిని ఆపేందుకు పరిశీలకులుగా ఉన్న పార్టీ నేతలు నానాతంటాలు పడ్డారు. సమావేశంలో జరిగిన విషయాల్ని చంద్రబాబుకు వివరిస్తామని, ప్రశాంతంగా ఉండాలని సర్దిచెప్పినా అసమ్మతివర్గం వినిపించుకోలేదు.
మంత్రి జవహర్‌ను నిలదీసిన వైరివర్గం..
మరోవైపు కొవ్వూరు నియోజకవర్గంపై నిర్వహించిన సమావేశంలో మంత్రి కేఎస్ జవహర్ ఎదుటే ఆయన అసమ్మతి వర్గం ఆందోళనకు దిగింది. పరిశీలకుల ఎదుటే జవహర్‌ను నిలదీయడమేగాక.. అవినీతికి పరాకాష్టగా మారిన ఆయనకు సీటిస్తే ఓడిస్తామని పలువురు నాయకులు హెచ్చరించారు. ఇందుకు జవహర్ అనుకూల వర్గం అభ్యంతరం చెప్పడంతో గొడవ జరిగి రెండు వర్గాలు తోపులాటకు దిగాయి. పరిశీలకులు ఆపినా పట్టించుకోని కార్యకర్తలు జవహర్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. జవహర్ డౌన్ డౌన్, అవినీతిపరుడు జవహర్‌కు సీటివ్వొద్దు అంటూ నినాదాలు చేశారు. రెండు నియోజకవర్గాల సమావేశాలు రసాభాసగా మారడంతో సీఎం నివాస ప్రాంతం వద్ద గందరగోళం నెలకొంది. పోలీసులు వచ్చి ఆందోళన చేసిన వారిని అడ్డుకుని దూరంగా పంపించివేశారు.
కొవ్వూరు నుంచే పోటీ చేస్తా: జవహర్
సమావేశానంతరం మంత్రి జవహర్ మీడియాతో మాట్లాడుతూ తాను మళ్లీ కొవ్వూరు నుంచే పోటీ చేస్తానని, కొందరు నాయకులు అహంకారంతో కావాలని తనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారని చెప్పారు. తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment