ఎల్లారెడ్డిపేట మండలంలో రైతు ఆశీర్వాద సభలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్.చిత్రంలో మంత్రి పోచారం
సాక్షి, సిరిసిల్ల : ‘శాసనసభ రద్దయి రెండు నెలలైంది. వీళ్ల ముఖాలకు కలిసి కూర్చుని సీట్లు పంచుకునే తెలివిలేదు. కలసి ప్రభుత్వాన్ని నడుపుతారా? గూట్లో రాయి తీయనోళ్లు.. ఏట్లో రాయి తీస్తరట’అని మహాకూటమిని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో శనివారం నిర్వహించిన రైతు ఆశీర్వాద సభ లో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కూటమి సీట్లు పంచుకునేలోపే మనం స్వీట్లు పంచుకుంటామని చెప్పారు. ‘రాహుల్ సీట్లిస్తే, చంద్రబాబు నోట్లు ఇస్తున్నడు..రాహుల్ సీట్లకు, చంద్రబాబు ఓట్లకు తెలంగాణ ప్రజలు ఓట్లతో బుద్ధిచెప్పాలె’అని పిలుపునిచ్చారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చాలని సీఎం కేసీఆర్ పనిచేస్తుంటే.. ప్రాజెక్టులను అడ్డుకోడానికి ఉత్తరాలు రాసిన చంద్రబాబుతో జతకట్టిన మాయాకూటమిని నమ్మి మోసపో వద్దని చెప్పారు. చంద్రబాబుకు జుట్టు చేతికిస్తే తెలంగాణ ప్రాజెక్టులను కట్టనిస్తాడా? అని ప్రశ్నించారు.
పాపం కోదండరాం సార్‌ను ఇరికిచ్చిండ్రు
‘కోదండరాం సార్ అమాయకుడు. ఆయన్ను పట్టుకు ని కాంగ్రెసోళ్ల చేతిలో కూర్చోబెట్టిన్రు. పాపం సారును ఇరికిచ్చిండ్రు’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ది మామూలు హస్తం కాదని, భస్మాసుర హస్తమని పేర్కొన్నారు. ఎవరు పట్టుకుంటే వాళ్లు భస్మం అయితరు.. పాపం కోదండరాం సార్ ఆ చెయ్యి పట్టిండు..ఆయన పరిస్థితి చూస్తుంటే బాధేస్తోందన్నారు. గతంలో తాను సోనియాను అ మ్మా బొమ్మా అంటే ఐదు ఫీట్లు ఉన్నోడు కూడా ఆరు ఫీట్లు ఎగిరిండ్రు.. చంద్రబాబు మీ సోనియమ్మ ను ఎన్ని తిట్లు తిట్టిండు.. సోనియా ఈ దేశం పాలిట దెయ్యం.. అవినీతి అనకొండ.. కాంగ్రెస్ ఈ దేశానికి పట్టిన శని..ఇటాలియన్ మాఫియా.. అంటూ తిట్టిన చంద్రబాబుతో సిగ్గులేకుండా కలసి తిరుగుతారా? అని దుయ్యబట్టారు. కూటమికి అధికారమిస్తే రైతు ల నోట్లో మట్టికొడతారని కేటీఆర్ హెచ్చరించారు. రైతును రాజుగా చేయడమే తమ ధ్యేయమని కేటీఆర్ తెలిపారు. గతంలో అర్ధరాత్రుల్లో కరెంటు కోసం కావలి కాసే పరిస్థితి ఉండేదని, విత్తనాలు, ఎరువు లు, పురుగు మందుల కోసం రైతులు బారులు తీరే వారని గుర్తు చేశారు. అలాంటి స్థితి నుంచి సీఎం కేసీఆర్ తెలంగాణను కోటి ఎకరాల మాగాణి చేసేందు కు కృషి చేస్తున్నారన్నారు. కాళేశ్వరం మరో 4 నెలల్లోనే ప్రాజెక్టు పూర్తి కాబోతోందని తెలిపారు.
రైతుల దగ్గరికి వెళ్లాలంటేనే భయమేసేది: పోచారం
మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వానికి కృతజ్ఙతతో పెట్టుకున్న మొట్టమొదటి రైతు ఆశీర్వాదసభ ఇదేనని చెప్పారు. ‘నేను టీడీపీలో మంత్రిగా పనిచేసిన.. అప్పుడు రైతుల దగ్గరికి వెళ్లి మాట్లాడాలంటే భయమేసేది.. ఇప్పుడు తలెత్తుకుని మాట్లాడుకుంటున్నం. వందకుపైగా సీట్లలో కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్ కూడా రాకుండా చేయాలి’అని ఆయన కోరారు. కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, రాష్ట్ర వికలాంగుల సహకార కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment