కేసీఆర్‌ నాయకత్వమే శ్రీరామరక్ష | KTR Fires On Opposition Parties | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ నాయకత్వమే శ్రీరామరక్ష

Published Mon, Feb 3 2020 3:21 AM | Last Updated on Mon, Feb 3 2020 3:21 AM

KTR Fires On Opposition Parties - Sakshi

కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ నేతలు

సాక్షి, హైదరాబాద్‌: ఇండియా–పాకిస్తాన్, హిందూ–ముస్లిం అనడం.. చలికాచుకోవడం తప్ప ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటి కూడా బీజేపీ దగ్గర లేదని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారకరామారావు విమర్శించారు. బీజేపీ నేతలకు మత రాజకీయాలు తప్ప దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని లేదన్నారు. రాష్ట్రానికి సీఎం కేసీఆర్‌ నాయకత్వమే శ్రీరామరక్ష అన్నారు. రైతుబంధు, రైతుభరోసా, విద్యార్థులకు సన్నబియ్యపు భోజనం, కల్యాణలక్ష్మీ వంటి పథకాలతో ప్రజల గుండెల్లో కేసీఆర్‌ స్థానం సుస్థిరమైపోయిందని, అందుకే ఏ ఎన్నికైనా టీఆర్‌ఎస్సే గెలుస్తోందన్నారు. టీఆర్‌ఎస్‌ వరుస విజయాలతో కాంగ్రెస్, బీజేపీలకు మతిపోయిందని అన్నారు. శంషాబాద్‌ మున్సిపాలిటీ నుంచి ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ తరఫున గెలిచిన 8 మంది కౌన్సిలర్లు టీడీపీ నేత గణేశ్‌ గుప్తా నేతృత్వంలో ఆదివారం టీఆర్‌ఎస్‌లో చేరారు. కేటీఆర్‌ వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అడ్డిమారి గుడ్డిదెబ్బలా 4 సీట్లు..
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పేరుకే జాతీయ పార్టీలని, వాటికి నీతి, నిజాయితీ, సిద్ధాంతం లేదని కేటీఆర్‌ మండిపడ్డారు. అడ్డిమారి గుడ్డిదెబ్బ లాగా బీజేపీ రాష్ట్రంలో 4 ఎంపీ సీట్లు గెలవడంతో లక్ష్మణ్‌ రోజూ ప్రెస్‌మీట్‌ పెట్టి కేసీఆర్‌ను తిట్టే పని పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్రంలో గెలవాలంటే కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి వంటి ప్రాజెక్టులకు ఢిల్లీ నుంచి జాతీయ హోదా నిధులు తీసుకురావాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర బీజేపీ నేతలకు ఇది చేతకావడం లేదన్నారు.

ఫార్మాసిటీ నిర్మాణానికి రూ.3 వేల కోట్లు, హైదరాబాద్‌–వరంగల్, హైదరాబాద్‌–నాగ్‌పూర్, హైదరాబాద్‌–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ నిర్మాణానికి నిధులు, నీతి ఆయోగ్‌ సిఫారసుల మేరకు మిషన్‌ భగీరథకు రూ.19 వేల కోట్లు, మిషన్‌ కాకతీయకు రూ.5 వేల కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని కోరినా నయాపైసా కేటాయించలేదని తెలి పారు. బీజేపీ కేంద్ర బడ్జెట్లను ప్రవేశపెట్టిన అన్నిసార్లూ రాష్ట్రానికి అన్యాయమే చేసిందని మండిపడ్డారు.

3 పురపాలికల కోసం కాంగ్రెస్, బీజేపీ పొత్తు..
కాంగ్రెస్, బీజేపీలు తమ సిద్ధాంతాలను పక్కనబెట్టి బండ్లగూడ, మణికొండ, నార్సింగ్‌ మున్సిపాలిటీల చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్‌ స్థానాల కోసం పొత్తుపెట్టుకున్నాయని కేటీఆర్‌ మండిపడ్డారు. ఏం బతుకు అయింది రా.. 3 మున్సిపాలిటీల్లో బీజేపీతో పొత్తుపెట్టుకోవాల్సి వచ్చిం దని స్వయంగా పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హన్మంతరావు విమర్శించారని గుర్తుచేశారు. శంషాబాద్‌ మున్సిపాలిటీలో 25 వార్డులుంటే 14 వార్డులను టీఆర్‌ఎస్‌ గెలిస్తే, 8 వార్డులను గణేశ్‌ గుప్త నేతృత్వంలోని ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థులు గెలుచుకున్నారని, కాంగ్రెస్‌కు 2, బీజేపీకి ఒకే వార్డు మాత్రమే దక్కిందని కేటీఆర్‌ అన్నారు.

130 పురపాలికలకు ఎన్నికలు జరిగితే 122 పురపాలికలను టీఆర్‌ఎస్‌ గెలుచుకుందన్నారు. మొత్తం 3,148 డివిజన్లకు గాను టీఆర్‌ఎస్‌ 1800–1900 డివిజన్లను గెలుచుకుని అగ్రస్థానంలో నిలిస్తే, టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థులు, స్వతంత్రులు కలసి అత్యధిక స్థానాలు గెలుచుకోవడం ద్వారా రెండో స్థానంలో నిలిచారని తెలిపారు. డైలాగులు చెప్పడంలో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అదరగొడుతున్నా, మున్సిపల్‌ ఎన్నికల్లో ఈ పార్టీలు కనీసం రెండో స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేకపోయాయని ఎద్దేవా చేశారు.

45 శాతం బీసీలకు..
మున్సిపల్‌ ఎన్నికల్లో 45% సీట్లు బీసీలకు కేటాయించామని కేటీఆర్‌ తెలిపారు. మహిళలకు 244 చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్‌ స్థానాలు కేటాయించడం ద్వారా వారికి 57% కోటా అమలు చేశామన్నారు. రాజకీయంగా వెనకబడిన వర్గాలకు పదవుల కేటాయింపుల్లో ప్రాధాన్యతనిస్తున్నామని, ఆర్యవైశ్యులకు 11 చైర్‌పర్సన్‌ పదవులు కేటాయించామని తెలి పారు. అభివృద్ధి, సంక్షేమం అనే జోడెద్దులతో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు.

ఎన్నికల వ్యవస్థ, కోర్టులపై నమ్మకం లేదని ఫలితాల తర్వాత ఉత్తమ్‌ పేర్కొన్నారని, కాంగ్రెస్‌ పార్టీ దేశ ప్రజలు నమ్మకాన్ని కోల్పోయిందని విమర్శించా రు. శంషాబాద్‌ విమానాశ్రయం వరకు మెట్రో రైలు మార్గాన్ని పొడిగిస్తామని, దీంతో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. శంషాబాద్‌ మున్సిపాలిటీ, రాజేంద్రనగర్‌ నియోజకవర్గ అభివృద్ధికి చాలా చేస్తామని హామీ ఇచ్చారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు టీఆర్‌ఎస్‌ మద్దతు ఇవ్వకపోవడంతో రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా కేంద్రం మొండిచేయి చూపిందని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అమరవాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement