ముస్తాబాద్(సిరిసిల్ల): అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా తెలంగాణను ప్రగతిపథంలో నిలిపిన సీఎం కేసీఆర్ పక్షాన్నే ప్రజలు ఉన్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బషీర్‌బాగ్, ముదిగొండలో రైతులను కాల్చిచంపిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు.
ఒకవైపు అన్నదాతలు, నేతకార్మికుల ఆత్మహత్యలు లేని తెలంగాణ నిర్మాణం జరుగుతుండగా.. మరోవైపు కాంగ్రెస్ అభివృద్ధికి మోకాలడ్డుతోందని ధ్వజమెత్తారు. అందుకే ప్రజాక్షేత్రంలో తేల్చుకు నేందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లామన్నారు. రాష్ట్ర ప్రజలను ఆగం చేసేందుకు ఆంధ్రా సీఎం చంద్రబాబు ఈ ఎన్నికల్లో కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. రూ.500 కోట్లతో కాంగ్రెస్, టీడీపీ నేతలను కొనుగోలు చేసి.. ప్రజలను ప్రలోభాలకు గురిచేసి తెలంగాణను మరోసారి మోసం చేసేందుకు వస్తు న్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రాజెక్టులకు అడ్డంపడుతున్న చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం జుగుప్సాకరంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ హామీలు అర్రాస్ పాటను మించిపోతున్నాయన్నా రు. అన్నీ ఉచితంగా ఇస్తామంటూ.. టీఆర్‌ఎస్ ఇచ్చి న హామీలకు రెట్టింపు ఇస్తామంటూ మభ్యపెడుతున్నారని, యాభై ఏళ్లు పాలించి ఎందుకు అభివృద్ధి చేయలేదో ప్రజలకు చెప్పాలన్నారు. చంద్రబాబు ఓటుకు నోట్లు కేసులో దొరికి ఇప్పుడు తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వస్తున్నారన్నారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment