సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర కమిటీ, సీనియర్ నాయకులతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బుధవారం తెలంగాణ భవన్‌లో భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై డిసెంబర్ 27నాటి సమావేశంలో చర్చించిన అంశాలకు సంబంధించిన పురోగతిని తెలుసుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులను నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో ఉన్న అంశాలను పరిగణన లోకి తీసుకుని వివరాలు సేకరించాలని గతంలో కేటీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణకు సంబంధించి కేటీఆర్ పలు సలహాలు, సూచనలు ఇచ్చారు.
త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో ఉమ్మడి సమావేశాన్ని నిర్వహిస్తారని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై రూపొందించిన నివేదికలను కేటీఆర్‌కు పార్టీ ఇన్‌చార్జీలు అంద జేశారు. సమావేశం సందర్భంగా నూతన సంవత్సరం తొలిరోజు తెలంగాణ భవన్‌కు వచ్చిన కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు తరలివచ్చారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డితోపాటు ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, వెంకటేశ్ నేత తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment