సాక్షి, బెంగళూరు: జేడీఎస్ అగ్రనేత, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి బీజేపీకి అనుకూలంగా కొత్త పల్లవి అందుకున్నారు. మొన్నటివరకు కాంగ్రెస్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఆయన కాషాయ పార్టీకి అనుకూలంగా గళం సవరించుకున్నారు. రాష్ట్రంలో యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కూలిపోయే అవకాశమే లేదని, ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే బీజేపీకి తమ పార్టీ మద్దతునిస్తుందని కుమారస్వామి వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.
అందుకోసమేనా.
రాష్ట్రంలో కాంగ్రెస్ సీనియర్లు డీకే శివకుమార్, పరమేశ్వర్ వంటివారిపై ఐటీ, ఈడీ దాడులు జరుగుతుండడం, తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం కుమారస్వామి ఈ ఎత్తుగడను వేస్తున్నట్లు చర్చ సాగుతోంది. జేడీఎస్‌లోని పది నుంచి 12 మంది ఎమ్మెల్యేలు కొన్ని రోజులుగా బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతూ, అధికార పార్టీ తీర్థం పుచ్చుకునే ఆలోచనలు చేస్తున్నారు. ఈ తరుణంలో తన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పావులు కదిపారు. బీజేపీకి మద్దతిస్తున్నట్లు ప్రకటిస్తే తమ ఎమ్మెల్యేలు ఫిరాయించకుండా ఆగిపోతారనే ఉద్ధేశంతోనే ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కుమారస్వామి ప్రకటన సీఎం యడియూరప్పకు ఊరట కలిగించి ఉంటుంది. మెజారిటీ లేని ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న యడ్డి డిసెంబరులో జరిగే ఉప ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి తీరాల్సిందే. ఇలాంటి సమయంలో బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కుమారస్వామి బహిరంగంగా ప్రకటించడం యడియూరప్పకు ప్రయోజనం కలిగించే అంశమే. బీజేపీని ఎలాగైనా గద్దె దింపాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ నేతలను కుమార యూ– టర్న్ నీరుగార్చింది.
Comments
Please login to add a commentAdd a comment