
సాక్షి, తాడేపల్లి : అవినీతి రహిత ఆరునెలల పరిపాలనను చూసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వ్యాఖ్యానించారు. జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో పాలనలో భాగస్వామ్యం కావడం తన అదృష్టమని పేర్కొన్నారు. శనివారం కన్నబాబు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, వైఎస్ జగన్‌ల పరిపాలనలో తేడాలను వివరించారు.
ఆయన మాటల్లోనే.. ‘చంద్రబాబు హయాంలో గాడి తప్పిన పాలనను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సరిదిద్దుతున్నారు. వైఎస్ జగన్ పాలనను చూసి చంద్రబాబుకు కడుపు మండుతోంది. టీడీపీ వేసిన పుస్తకం అబద్ధాల పుట్ట. ప్రజలను, నమ్మిన వాళ్లను ముంచడంలో చంద్రబాబుది పేటెంట్ హక్కు. ఆ పుస్తకాన్ని మడిచి లోకేష్ సూట్‌కేస్‌లో పెట్టుకోవాలి. అమరావతిలో డ్రామాలాడిన చంద్రబాబును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. అవినీతికి పాల్పడి మళ్లీ ముద్దులు పెడుతున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు ఒక్క హామీని నెరవేర్చలేదు. ఇరు పార్టీల మేనిఫెస్టో అమలుపై చర్చకు మేం సిద్ధం. జగన్ అధికారంలోకి వచ్చాక ఆరు నెలల్లో 90 శాతం హామీలు అమలు చేశారు. అటు చంద్రబాబు చేసిన తొలి ఐదు సంతకాలకే దిక్కులేదు. రుణమాఫీ ఐదు విడతల్లో ఇస్తానని, మూడు విడతలు ఇచ్చి రైతులను మోసం చేశారు. దేశంలోనే అవినీతి సామ్రాట్ చంద్రబాబు నాయుడు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట. నందిని పంది, పందిని నంది అని నమ్మించగల సమర్థుడు. ఔట్ డేటెడ్ లీడర్ చంద్రబాబు అయితే, అప్‌డేట్ కాని లీడర్ లోకేష్’ అని దుయ్యబట్టారు.
ఇంకా.. ‘జగన్మోహన్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబుకు పంపిస్తాము. వాటిని చదివి వాస్తవాలు తెలుసుకోవాలి. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఛిన్నాభిన్నం చేశారు. ఓటుకు కోట్లు కేసుకు భయపడి హైదరాబాద్ నుంచి విజయవాడకు పారిపోయి వచ్చాడు. అధికారంలో ఉన్నప్పుడు ఏ వర్గాన్ని వదలకుండా మోసం చేయడంతో ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. ఇంగ్లీష్ మీడియం పెడితే తన ఫైనాన్షియర్లకు ఇబ్బంది అవుతుందని చంద్రబాబు బాధపడుతున్నారు. అవినీతిని నిర్మూలించాలని టోల్‌ఫ్రీ నంబరు పెట్టిన ఘనత జగన్‌ది. ప్రజా సమస్యలపై స్పందన కార్యక్రమం పెట్టారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. బాక్సైట్ గనుల లీజును రద్దు చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేయాలని చంద్రబాబు చూస్తే, బాధితులను వైఎస్ జగన్ ఆదుకున్నారు. చంద్రబాబు, లోకేష్‌ల అవినీతిపై ముందుంది ముసళ్ల పండగ. తండ్రీకొడుకుల అవినీతి చూసి ప్రభుత్వం వేసిన కమిటీ సభ్యులే ఆశ్చర్యపోతున్నారు. వారు చేసిన అవినీతిని వెలికితీసి ప్రజల ముందు ఉంచుతాం. వైఎస్ జగన్ దయాదాక్షిణ్యం మీదే టీడీపీ బతికి ఉంది. ఆయన సరే అంటే ఆ పార్టీలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలే మిగులుతార’ని వెల్లడించారు.