బాగల్‌కోట జిల్లా జమఖండి సభలో ప్రధాని మోదీకి జ్ఞాపికను ఇస్తున్న బీజేపీ నాయకులు
సాక్షి, చిత్రదుర్గ/రాయ్‌చూర్/బాగల్‌కోట్/హుబ్లీ: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పోలింగ్ తేదీ దగ్గరవుతున్న కొద్దీ.. వాగ్బాణాల వాడి పెరుగుతోంది. భారతీయ సైన్యంలో సేవలందిస్తోన్న ఉత్తర కర్ణాటకకు చెందిన ముధోల్ శునకాల నుంచైనా దేశభక్తి నేర్చుకోండంటూ కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హుబ్లీలో ఆదివారం జరిగిన ప్రచార ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. ‘దేశభక్తి అనే మాట వినపడగానే ఇబ్బందిపడేవారికి, దేశభక్తిని విమర్శించేవారికి, దేశభక్తి వల్లనే కష్టాలని భావించేవారికి నేనొకటే చెబుతున్నా.
మీ పెద్దల నుంచి మీరేం నేర్చుకోలేదు.. కనీసం సైన్యంలో సేవలందిస్తోన్న ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన శునకాల నుంచైనా కాస్త దేశభక్తి నేర్చుకోండి. అలా నేర్చుకుంటారని కూడా నేను అనుకోవడం లేదు’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘దేశాన్ని ముక్కలు చేస్తామంటూ నినాదాలు చేసిన వారికి మద్దతిచ్చిన పార్టీ మీది’ అని మండిపడ్డారు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆందోళనల సమయంలో విద్యార్థులకు ప్రస్తుత కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ స్వయంగా వెళ్లి సంఘీభావం తెలిపిన విషయాన్ని ప్రధాని ఇలా పరోక్షంగా ప్రస్తావించారు. ఉత్తర కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలోని ముధోల్ ప్రాంతానికి చెందిన జాతి కావడంతో ఇక్కడి శునకాలకు ఆ పేరు వచ్చింది. అవి భారతీయ ఆర్మీలో సేవలందిస్తున్న తొలి భారతీయ జాతి శునకాలు.
పేదలకు పదవులు వారికిష్టంలేదు
‘వారు అంబేడ్కర్‌ను అవమానించారు. ఆయనను అంగీకరించలేదు. సమయాన్ని ఇవ్వలేదు’ అని బాగల్‌కోట్ బహిరంగ సభలో మోదీ పేర్కొన్నారు. దళిత నాయకుడైన రామ్‌నాథ్ కోవింద్‌ను బీజేపీ రాష్ట్రపతిగా గెలిపించుకోవటం కూడా కాంగ్రెస్‌కే నచ్చలేదన్నారు. ‘దేశంలో ప్రస్తుతం ఉన్న పదవులను పేదలు, సామాన్యులు అందుకోవటం కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారింది’ అని విమర్శించారు. ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ విధానాలను ప్రశ్నించారని అప్పటి మైసూరు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్. నిజలింగప్పను కాంగ్రెస్ దారుణంగా అవమానించిందన్నారు.
ఓటుబ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ ఎంతకైనా తెగిస్తోందని చిత్రదుర్గ ర్యాలీలో మోదీ విమర్శించారు. ‘18వ శతాబ్దంలో దళిత సామాజిక వర్గానికి చెందిన ఒణకె ఓబవ్వ చిత్రదుర్గ సామ్రాజ్యాన్ని కాపాడుకోవటం కోసం సుల్తాన్ వంశస్తుడైన మైసూరు హైదర్ అలీ సైన్యంతో పోరాడి.. కన్నడ తెగువను చూపారు. అలాంటి ఎందరో యోధులు, యోధురాళ్లను విస్మరించిన కాంగ్రెస్.. సుల్తాన్‌ల జయంతులు మాత్రం జరుపుతోంది’ అని మండిపడ్డారు.
దోపిడీని అరికట్టినందుకే..
రాజకీయంగా తనను ఎదుర్కొనేందుకే కాంగ్రెస్ పార్లమెంటు సమావేశాలనూ అడ్డుకుంటోందని మోదీ విమర్శించారు. ‘నన్ను వ్యతిరేకించటం, విమర్శించటమే కాంగ్రెస్‌కు ఉన్న ఏకైక ఎజెండా. అందుకే పార్లమెంటును కూడా జరగనీయటం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీని మేం అరికట్టాం. అందుకే వారు నాపై, మా పార్టీ నేతలను దూషిస్తున్నారు’ అని తెలిపారు. తాము అధికారంలోకివస్తే రాయచూరు జిల్లాలో పండించే సోనామసూరి బియ్యానికి అంతర్జాతీయ మార్కెట్‌లో గుర్తింపు తెస్తామని, హట్టి బంగారు గనుల అభివృద్ధికి శ్రమిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment