అగర్తలాలో విజయోత్సవాలు చేసుకుంటున్న బీజేపీ మహిళా కార్యకర్తలు
అగర్తలా: త్రిపురలో 25 ఏళ్ల అప్రతిహత కమ్యూనిస్టు పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. బీజేపీ–ఐపీఎఫ్‌టీ (ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర) కూటమికి భారీ మెజారిటీతో పట్టంగట్టారు. ఇంతవరకు త్రిపురలో ఒక్క కౌన్సిలర్ సీటు కూడా లేని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతోంది. ఫిబ్రవరి 18న త్రిపుర అసెంబ్లీకి ఎన్నికలు జరగగా.. శనివారం ఫలితాలు వెల్లడయ్యాయి. బీజేపీ కూటమి 43 ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించింది. కమలం పార్టీ సొంతంగా 35 స్థానాలను కైవసం చేసుకోగా.. ఐపీఎఫ్‌టీ 8 చోట్ల విజయం సాధించింది. మాణిక్ సర్కార్ నేతృత్వంలోని సీపీఎం 16 సీట్లకే పరిమితమైంది. గత అసెంబ్లీలో 10 స్థానాలతో విపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కు ఒక్క సీటుకూడా దక్కలేదు. విపక్ష మొత్తం 60 స్థానాలకు గానూ 59 సీట్లకు ఎన్నికలు జరిగాయి. అభ్యర్థి మృతితో ఒక స్థానంలో ఎన్నిక వాయిదా పడిన సంగతి తెలిసిందే.
వామపక్షానికి షాకింగ్ ఓటమి
త్రిపురలో సీపీఎంకు ఇంత దారుణమైన ఓటమి ఎన్నడూ ఎదురుకాలేదు. 1988లో కాంగ్రెస్–త్రిపుర ఉపజాతి జుబా సమితి కూటమి అధికారం సంపాదించినా.. ఇంత తక్కువ సీట్లను పొందలేదు. అటు, కౌన్సిలర్ సీటుకూడా లేని స్థానం నుంచి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ తీవ్రంగా శ్రమించింది. ప్రభుత్వ వ్యతిరేకతను సరిగ్గా వినియోగించుకుని వ్యూహాత్మక ప్రచారంతో దూసుకెళ్లింది. మొత్తం 51 స్థానాల్లో బీజేపీ పోటీ చేయగా దాదాపు 43 శాతం ఓట్లు సంపాదించింది. 9 చోట్ల అభ్యర్థులను నిలిపిన ఐపీఎఫ్‌టీ దాదాపు 7.5 శాతం ఓట్లను పొందింది. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విప్లవ్ దేవ్ ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో 50–60 శాతం ఓట్లను పొందిన వామపక్ష కూటమి ఈసారి 42.7 శాతం ఓట్లు సాధించింది. ఒక్కసీటు కూడా గెలవని కాంగ్రెస్ రెండు శాతానికన్నా తక్కువ ఓట్లు పొందింది. గిరిజనుల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో బీజేపీ భారీ మెజారిటీ సంపాదించింది.
ప్రజలు మార్పుకు ఓటేశారు
త్రిపుర ప్రజలు మార్పును కోరుకోవటమే తమ ఘనవిజయానికి కారణమని బీజేపీ నేత రాంమాధవ్ పేర్కొన్నారు. ‘మేం ‘పరివర్తన్’ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాం. ప్రజలు కూడా మార్పును బలంగా కోరుకున్నారు. అందుకే మాకు పట్టంగట్టారు’ అని ఆయన పేర్కొన్నారు. అస్సాం మంత్రి, త్రిపుర బీజేపీ ఇంచార్జ్ హిమంత బిస్వ శర్మ మాట్లాడుతూ.. ‘మాణిక్ సర్కార్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉంది. 25 ఏళ్లుగా వారే పాలిస్తున్నా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అందుకే ప్రజలకు వారిని గద్దెదించి బీజేపీకి అవకాశమిచ్చారు. గిరిజన ప్రాంతాల్లో బలంగా ఉన్న ఐపీఎఫ్‌టీ కూడా బీజేపీ విజయంలో కీలక భాగస్వామి. త్రిపుర జనాభాలో 35 శాతం ఓట్లు గిరిజనులవే. వారు ఏకపక్షంగా బీజేపీకి మద్దతిచ్చారు’ అని వెల్లడించారు. మైనారిటీలు మరీ ముఖ్యంగా క్రిస్టియన్లు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారన్న వార్తల్లో వాస్తవం లేదని.. వారంతా మనస్ఫూర్వకంగా బీజేపీకి మద్దతు తెలిపారని శర్మ పేర్కొన్నారు. ‘త్రిపుర ప్రజలు రాష్ట్రంలో బీజేపీ కూటమికి అధికారమిచ్చారు. 25 ఏళ్లుగా వారికి సేవచేసే అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు. బీజేపీ త్రిపురతోపాటు దేశవ్యాప్తంగా విభజన రాజకీయాలకు పాల్పడుతోంది’ అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ విమర్శించారు.
నేను సిద్ధమే.. కానీ పార్టీ నిర్ణయిస్తుంది
త్రిపురలో బీజేపీ అధికారంలోకి రావటంలో ముఖ్యమంత్రి అభ్యర్థిపై చర్చ మొదలైంది. ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విప్లవ్ కుమార్ దేవ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రచారం జరుగుతోంది. అయితే అవకాశం ఇస్తే సీఎంగా సేవలందించేందుకు తాను సిద్ధమేనని.. కానీ నిర్ణయం తీసుకోవాల్సింది పార్టీ పార్లమెంటరీ బోర్డేనన్నారు. ‘బాధ్యతలు తీసుకునేందుకు నేను సిద్ధమే. నాకు అప్పజెప్పిన పనినుంచి నేనెప్పుడూ పారిపోను. పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నాకు ఇచ్చారు. దీన్ని నా సామర్థ్యానికి అనుగుణంగా నెరవేరుస్తున్నాను’ అని విప్లవ్ తెలిపారు. బీజేపీ ఇచ్చిన పిలుపుతో 25 ఏళ్ల కమ్యూనిస్టు కోటను కూకటివేళ్లతో పెకిలించి.. తమకు అధికారాన్ని కట్టబెట్టిన త్రిపుర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ అమిత్‌షాలు తనను వెన్నంటి ప్రోత్సహించారన్నారు. ఇక త్రిపురను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయటమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ‘సీపీఎం పాలనలో రాష్ట్రం నష్టపోయింది. మేం సుపరిపానలతో పరిస్థితిలో మార్పు తీసుకొస్తాం’ అని దేవ్ పేర్కొన్నారు.
విప్లవ్ కుమార్ దేవ్
Comments
Please login to add a commentAdd a comment