
జోగిపేటలో శ్రీకాంత్‌రెడ్డిని సన్మానిస్తున్న దృశ్యం
జోగిపేట(అందోల్): పార్టీని బలోపేతం చేసే దిశగా శ్రేణులు కృషి చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జోగిపేటలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద ఆయన నివాళులు అర్పించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ వెళుతూ జోగిపేటలో కొద్దిసేపు ఆగి మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీని బలోపేతం చేసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీని ఇస్తుందని అన్నారు. 2019లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అక్కడ అధికారాన్ని చేపట్టగానే తెలంగాణలో కూడా ప్రత్యామ్నాయ శక్తిగా పార్టీని అభివృద్ధి చేసుకుంటామన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైపు యువత ఆశగా చూస్తోందని తెలిపారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాల వల్ల ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నిండాయన్నారు. చాలా సందర్భాల్లో ఇతర పార్టీలు సైతం దివంగత నేత ఘనతను గుర్తు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయని తెలిపారు. అందోల్ నియోజకవర్గంలో దివంగత నేత అభిమానులు ఎంతో మంది ఉన్నారని, ఈ ప్రాంతం మీదుగా ఆ మహానేత నడిచారని, సేద్యానికి సింగూరు జలాలను అందించేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేశారని, రైతులకు కూడా ఈ విషయం తెలుసని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.సంజీవరావు, పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్‌రెడ్డి, సంగారెడ్డి జిల్లా యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బాగయ్య, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ రమేశ్, జిల్లా కార్యదర్శి పరిపూర్ణ, జిల్లా నాయకులు బుచ్చయ్య, ప్రవీణ్‌కుమార్, అరవింద్ ఆయన వెంట ఉన్నారు.