LIVE: Lok Sabha Election Results LIVE Updates | లోక్ సభ ఎన్నికల ఫలితాలు | Telugu - Sakshi
Sakshi News home page

లోక్‌సభ ఎన్నికలు అప్‌డేట్స్‌

Published Thu, May 23 2019 7:19 AM | Last Updated on Thu, May 23 2019 8:31 PM

Lok Sabha Election 2019 Results Live Updates - Sakshi

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా, బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులు, అభిమానులు పూల వర్షంతో వారిద్దరికి ఘన స్వాగతం పలికారు.

వారణాసిలో మోదీ భారీ విజయం
వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ విజయ దుందుభి మోగించారు. దాదాపు 3 లక్షల అరవై వేలకు పైగా ఓట్ల తేడాతో భారీ విజయం సాధించారు. అదే విధంగా ఎన్డీయే స్పష్టమైన మెజారిటితో గెలుపు దిశగా దూసుకువెళ్తున్న క్రమంలో ఈ నెల 29న రెండోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

అమిత్‌షా విజయం
గుజరాత్‌లోని గాంధీనగర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఘన విజయం సాధించారు.  

యడ్యూరప్ప కుమారుడి విజయం
శివమొగ్గ నుంచి పోటీ చేసిన యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర విజయం సాధించారు. 

వయనాడ్‌లో రాహుల్‌ విజయం
కేరళ నుంచి బరిలో దిగిన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఘన విజయం సాధించారు.

రాహుల్‌ నివాసానికి సోనియా
ఫలితాల నేపథ్యంలో.. కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ.. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నివాసానికి వెళ్లారు.

ఈసీకి ఊర్మిళ ఫిర్యాదు
ఉత్తర ముంబై కాంగ్రెస్‌ అభ్యర్థి ఊర్మిళ మండోద్కర్‌ వెనకంజలో ఉన్నారు. ఈ క్రమంలో ఆమె ఈవీఎంల పనితీరుపై అనుమానం వ్యక్తం చేశారు. ఈవీఎం నంబర్లు, సిగ్నెచర్‌లలో తేడాలున్నాయని ఆరోపించారు. ఈ మేరకు ఈసీకి ఫిర్యాదు చేశారు.

మోదీకి శ్రీలంక ప్రధాని శుభాకాంక్షలు
బీజేపీ గెలుపు ఖాయమైన నేపథ్యంలో.. శ్రీలంక ప్రధాని రణీల్‌ విక్రమసింగే ప్రధాని నరేంద్ర మోదీకి ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

బీజేపీ కార్యకర్తల సంబరాలు
దేశవ్యాప్తంగా బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ‘ఫిర్‌ ఏక్‌ బార్‌ మోదీ సర్కార్‌’ నినాదాలతో, చౌకీదార్‌ టీ షర్ట్స్‌తో బీజేపీ కార్యకర్తలు ఢిల్లీలోని పార్టీ కార్యాలయం ఎదుట కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ నేతలతో భేటీ కానున్నారు.

గోవాలో బీజేపీకి షాక్‌
గోవా పనాజీ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ ఓటమి పాలైంది. సీఎం పారికర్‌ కన్నుమూయడంతో ఈ స్థానానికి ఎన్నిక జరిగింది.

రాహుల్‌ను కలిసి వెళ్లిన ప్రియాంక
ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. తన సోదరుడు, పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని ఆయన నివాసంలో కలిశారు.

మోదీకి సుష్మ శుభాకాంక్షలు
దేశవ్యాప్తంగా బీజేపీ విజయం దిశగా దూసుకెళుతుండడంతో ఆ పార్టీ సీనియర్‌ నేత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌ ఆశాభోంస్లే కూడా మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.

మమతకు ఎదురుదెబ్బ
పశ్చిమ్‌బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గతంలో కేవలం రెండు సీట్లు దక్కించుకున్న బీజేపీ ఇప్పుడు ఏకంగా 17 స్థానాల్లో ఆధిక్యంలో ఉండటం విశేషం. ఇక తృణమూల్‌ 24 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది.

చెన్నైలో ఉద్రిక్తత
చెన్నై క్వీన్‌ మేరి కాలేజ్‌ కౌంటింగ్‌ సెంటర్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈవీఎంల ట్యాపంరింగ్‌కు పాల్పడటమే కాక.. కౌంటింగ్‌లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఏఐడీఎంకే కార్యకర్తలు ఆరోపించారు. అంతేకాక కాలేజీ ఎదుట నిరసనకు దిగారు.

వెనకంజలో సుశీల్‌ కుమార్‌ షిండే
మహారాష్ట్ర మాజీ హోం మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే వెనకంజలో ఉన్నారు. నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు సుప్రియా సులే ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

7600 ఓట్ల ఆధిక్యంలో స్మృతి
అమేథీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వెనుకంజలో ఉన్నారు. ఆయనపై స్మృతి ఇరానీ 7600 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇకపోతే తిరువనంతపురం కాంగ్రెస్‌ అభ్యర్థి శశిథరూర్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

యూపీలో బీజేపీ హవా
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ దూసుకుపోతుంది. ఇప్పటి వరకూ బీజేపీ 50 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇదిలా ఉండగా సుల్తాన్‌పూర్‌ నుంచి బరిలో దిగిన మేనకా గాంధీ వెనకంజలో ఉండటం గమనార్హం. ఎస్పీ అభ్యర్థి డింపుల్‌ యాదవ్‌ కూడా ముందంజలో ఉన్నారు. ములాయం, అఖిలేష్‌ యాదవ్‌లు కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

బీజేపీ-సేన ఆధిక్యం
మహారాష్ట్రలో బీజేపీ - శివసేన కూటమి దూసుకుపోతుంది. ఇప్పటి వరకూ జరిగిన కౌంటింగ్‌లో బీజేపీ - సేన 40కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. కాంగ్రెస్‌- ఎన్‌సీపీ కూటమి కేవలం ఆరు స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ నాగ్‌పూర్‌ నుంచి 3 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతుండగా.. సుభాష్‌ భమ్రే 13 వేల ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.

వెనకంజలో కృష్ణ పూనియా
జైపూర్‌ రూరల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి కృష్ణ పూనియా వెనకంజలో ఉండగా.. రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

అత్యధిక ఆధిక్యంలో అమిత్‌ షా
బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా గాంధీ నగర్‌లో దాదాపు 1,25,000 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు.

కన్హయ్య కుమార్‌ వెనకంజ
బిహార్‌ బెగుసరాయ్‌ నుంచి సీపీఐ తరఫున బరిలో నిలిచిన కన్హయ్య కుమార్‌ వెనకంజలో ఉన్నారు.

కర్ణాటకలో కూటమికి షాక్‌
కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమికి భారీ షాక్‌ తగిలింది. మొత్తం 28 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ 23 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుండగా.. కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. మండ్యలో సుమలత 1200 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు.

బెంగాల్‌లో హోరాహోరి
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ, తృణమూల్‌ పార్టీల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. బెంగాల్‌లో మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ 18 చోట్ల, టీఎంసీ 20 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

పంజాబ్‌లో బీజేపీకి షాక్‌
దేశవ్యాప్తంగా మోదీ హవా కొనసాగుతున్నప్పటికి పంజాబ్‌లో మాత్రం బీజేపీ వెనకబడింది. ఇక్కడ కాంగ్రెస్‌ 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. బీజేపీ, శిరోమణి అకాలీదళ్‌ చెరో రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఆప్‌ 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది.

ఢిల్లీలో బీజేపీ క్లీన్‌ స్వీప్‌
ఢిల్లీ ఏడు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది.

ఆధిక్యంలో అనంత కుమార్‌ హెగ్డే
కర్ణాటక బీజేపీ అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్నారు.

భారీ ఆధిక్యం దిశగా అమిత్‌ షా
గాంధీనగర్‌ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా 50 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతుండగా.. మోదీ వారణాసి నుంచి 20 వేల ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు.

గంభీర్‌ ముందంజ.. శతృఘ్న వెనకంజ
పట్నా సాహిబ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి శతృఘ్న సింహ వెనకంజలో ఉండగా.. తూర్పు ఢిల్లీ బీజేపీ అభ్యర్థి గౌతమ్‌ గంభీర్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

తల్లి తడబాటు.. ఆధిక్యంలో కొడుకు
కేంద్ర మంత్రి మేనకా గాంధీ సుల్తాన్‌పూర్‌లో వెనకంజలో ఉండగా.. వరుణ్‌ గాంధీ మాత్రం ఫిలిబిత్‌లో దూసుకుపోతున్నారు. మరోవైపు సోనియా గాంధీ రాయ్‌బరేలీలో ముందంజలో ఉన్నారు. ఎస్పీ అధ్యక్షుడు ములాయం సింగ్‌ యాదవ్‌ మెయిన్‌పూర్‌లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

దూసుకుపోతున్న బీజేపీ..
రెండు రౌండ్ల కౌంటింగ్‌ ముగిసిన తర్వాత బీజేప 312స్థానాల్లో, కాంగ్రెస్‌ 110, ఇతరులు 95 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

వారణాసిలో మోదీ భారీ ఆధిక్యం
వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారీ ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన 11,000 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు

జమ్మూకశ్మీర్‌ ఫలితాల తీరు
మొదటి రౌండ్‌ కౌంటింగ్‌లో జమ్మూకశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు ఫరూఖ్‌ అబ్దుల్లా, బీజేపీ నాయకుడు జితేంద్ర సింగ్‌, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జి.ఏ మీర్‌ తమ తమ నియోజకవర్గాల్లో ముందంజలో కొనసాగుతున్నారు.

ఆధిక్యంలో సుమలత.. వెనకంజ వేస్తున్న జయప్రద
కర్ణాటకలోని మండ్య నుంచి  స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సినీ నటి సుమలత ముందంజలో ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ రాంపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సినీ నటి జయప్రద(బీజేపీ) వెనుకంజలో ఉన్నారు.

ఖర్గే వెనకంజ
కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే గుల్బర్గలో వెనకంజంలో ఉన్నారు.

హేమ మాలిని, సన్నీ ముందంజ
మధుర, గురుదాస్‌పూర్‌లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగతుంది. మధుర నుంచి హేమ మాలిని, గురుదాస్‌పూర్‌ నుంచి సన్నీ డియోల్‌ ముందంజలో ఉన్నారు.

ఊర్మిళ తడబాటు..
ముంబయి ఉత్తర లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఊర్మిళ మండోద్కర్‌ వెనుకంజలో ఉన్నారు.

డిగ్గీకి షాక్‌..
కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్‌కు భారీ షాక్‌ తగిలింది. బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ భోపాల్‌లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

అమేథిలో ఆధిక్యంలోకొచ్చిన స్మృతి ఇరానీ
అమేథిలో ఉత్కంఠభరిత పోరు కొనసాగుతుంది. ఈవీఎం కౌంటింగ్‌లో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ముం‍దంజలో ఉన్నారు.

బెంగళూరు కీ స్థానంలో బీజేపీ ఆధిక్యం
కర్ణాటకలో బీజేపీ కంచుకోటగా పేరుగాంచిన దక్షిణ బెంగళూరులో బీజేపీ అభ్యర్థి తేజస్వీ సూర్య దూసుకుపోతున్నారు.

వయనాడ్‌లో రాహుల్‌ ఆధిక్యం
కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యకుడు రాహుల్‌ గాంధీ కేరళ వయనాడ్‌, ఉత్తరప్రదేశ్‌ అమేథిలో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. సోనియా గాంధీ రాయ్‌బరేలీలో ముందంజలో ఉన్నారు.

పోస్టల్‌ బ్యాలెట్‌లో దూసుకుపోతున్న కమలం
పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌లో బీజేపీ దూసుకుపోతుంది. ఇప్పటికే 116 స్థానాల్లో బీజేపీ అధిక్యంలో కొనసాగుతుండగా.. కాంగ్రెస్‌ పార్టీ 45 స్థానాల్లో, ఇతరులు 17 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ప్రత్యేక పూజలు
ఓట్ల లెక్కింపు నేపథ్యంలో పలురువు అభ్యర్థులు ఉదయమే ఆలయాలకు వెళ్లి ప్రత్యేక​ పూజలు చేశారు. తిరువంతపురం బీజేపీ అభ్యర్థి కుమ్మనమ్‌ రాజశేఖరన్‌.. థైకాడ్‌లోని అయ్యగారు ఆశ్రమాన్ని సందర్శించి, పూజలు నిర్వహించారు. హసన్‌ జేడీఎస్‌ అభ్యర్థి నిఖిల్‌ కుమారస్వామి.. మైసూరులోని చాముండేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గోరఖ్‌పూర్‌ నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన భోజపురి నటుడు రవికిషన్‌ ఇంట్లోనే దేవుడి చిత్రపటాలకు నమస్కరించారు. థైకాడ్‌లోని అయ్యగారు ఆశ్రమాన్ని సందర్శించి, పూజలు నిర్వహించారు. హసన్‌ జేడీఎస్‌ అభ్యర్థి నిఖిల్‌ కుమారస్వామి.. మైసూరులోని చాముండేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గోరఖ్‌పూర్‌ నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన భోజపురి నటుడు రవికిషన్‌ ఇంట్లోనే దేవుడి చిత్రపటాలకు నమస్కరించారు.

ఉత్కంఠకు నేడు తెర
నరాలు తెగే ఉత్కంఠకు నేడు తెరపడనుంది. దిగువసభ ఎన్నికల్లో పోటీ చేసిన జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెందిన 8,049 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కాసేపట్లో ప్రారంభమవుతుంది. ఏప్రిల్‌ 11 మొదలు మే 19 వరకు ఏడు విడతల్లో.. ఆరోపణలు, ప్రత్యారోపణలు, వ్యక్తిగత దూషణలతో హోరాహోరీగా సాగిన 17వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లు పూర్తి చేసింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల చరిత్రలోనే మొదటిసారిగా ఈవీఎంల్లోని ఓట్ల వివరాలను వీవీప్యాట్ల చీటీలతో ఈసీ సరిపోల్చనుంది. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2–3 మధ్యే పూర్తయిపోయినా వీవీప్యాట్ల చీటీలను కూడా లెక్కించాల్సి ఉండటంతో ఫలితాలు సాధారణ సమయం కన్నా ఐదారు గంటలు ఆలస్యంగా వెలువడే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement