
లక్నో : లోక్‌సభ సభ్యుడిగా తాను ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించిన లక్నో అంటే మాజీ ప్రధాని వాజ్‌పేయికి ప్రత్యేక అనుబంధముంది. లక్నోకే ప్రతిష్టాత్మకంగా మారిన 24 కి.మీ ఔటర్‌రింగ్‌రోడ్డు లాంటి ’పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్ హై’ను అక్కడివారు గుర్తుచేసుకుంటున్నారు. అమరుల మార్గం (షహీద్ పథ్) పేరుతో నిర్మించిన ఈ రోడ్డు ఇప్పుడు పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చింది.
’షహీద్ పథ్ అనేది లక్నోకు వాజ్‌పేయికి ప్రత్యక్షంగా ఇచ్చిన పెద్ద బహుమతి. దేశవ్యాప్తంగానూ స్వర్ణ చతుర్భుజిని నిర్మించింది ఆయనే. అంతకుముందు లక్నోలో ఒకసారి, ఢిల్లీలో మరోసారి తాను వాజ్‌పేయిని కలుసుకోవడం మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోయాయని రతన్‌కుమార్ అనే వ్యాపారవేత్త చెప్పారు. ఎప్పుడు కలిసినా ఆత్మీయంగా పలకరించడంతో పాటు, ఏ సమస్య మీద అయినా ఆయనను సులభంగా కలుసుకునేందుకు వీలుండేదని ఆ నియోజకవర్గ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ’పార్టీ అవసరాలు, ఫ్రస్తావన పక్కన పెడితే వాజ్‌పేయికి ఎవరితోనూ వ్యక్తిగత శతృత్వం లేదు. ఈ రోడ్డుపై ఏ మతానికి చెందిన వారైనా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడగలరేమో చూపించండి ’ అని అక్కడి దుకాణదారు తేజ్‌బహదూర్ వ్యాఖ్యానించాడు.’ మోదీ ప్రభుత్వం కూడా వాజ్‌పేయి ప్రభుత్వ పాలన నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ప్రస్తుత బీజేపీకి, వాజ్‌పేయి కాలం నాటి బీజేపీకి ఎంతో వ్యత్యాసముంది’ అన్నది పాత సామాన్ల కొనుగోలు వ్యాపారి షంషేర్ అలీ అభిప్రాయం.
రాజకీయ ప్రత్యర్థులు వచ్చేవాళ్లు...
చిన్న పిల్లాడిగా తన తండ్రి ద్విచక్రవాహనం లూనాపై లక్నోలో జరిగిన వాజ్‌పేయి ర్యాలీకి హాజరైన అనుభవాన్ని యూపీ డిప్యూటీ సీఎం దినేశ్‌శర్మ గుర్తుచేసుకున్నారు. ’చలికాలం రాత్రి 11.30 గంటలకు వాజ్‌పేయి ప్రసంగం మొదలుకాగా, దుప్పటిలో ముఖాన్ని పూర్తిగా కప్పుకున్న ఓ వ్యక్తిని మా నాన్న గుర్తుపట్టి దానిని లాగేశారు. సిద్ధాంతాల రీత్యా జనసంఘ్‌ను వ్యతిరేకించే ఆ వ్యక్తి పేరున్న కమ్యూనిస్టు నేత, పైగా ముస్లిం. జనసంఘ్‌లో ఏమైనా చేరుతున్నారా అంటూ మా నాన్న అడిగిన ప్రశ్నకు అరే అటువైపు చూడండి ప్రముఖ సమాజ్‌వాది సిద్ధాంతకర్త కూడా వాజ్‌పేయి ప్రసంగం వినడానికి ముసుగు ధరించి వచ్చారు అంటూ అటువైపు చూపారు’ అని దినేశ్‌శర్మ తెలిపారు. సంఘ్ కార్యకలాపాలు, సిద్ధాంతాలు వ్యతిరేకించే ఇతర పార్టీల వారికి కూడా వాజ్‌పేయి ఎలా ఆమోదయోగ్యుడో తెలిపేందుకు ఈ ఉదంతం సరిపోతుందని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment