మహబూబాబాద్.. అసలు పేరు మానుకోట. ఈ కోటలో లోక్‌సభ ఎన్నికల పోటీ ఏకపక్షంగానే సాగుతోందని క్షేత్రస్థాయి పరిశీలన చెబుతోంది. రాజకీయ చైతన్యానికి పెట్టని కోట అయిన మానుకోట బరిలో అసెంబ్లీ ఫలితాలతో పోలిస్తే టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థులే అయినా లోక్‌సభ పోలింగ్ దగ్గర పడుతున్న ఈ సమయంలో సీన్ రివర్స్ అయి గులాబీ పార్టీ జోరు మీదుంటే.. కాంగ్రెస్ ప్రచార స్థాయిలోనే
చతికిలపడిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. గిరిజనులు, ఆదివాసీలు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోమొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 4,90,575 ఓట్లు వస్తే కాంగ్రెస్‌కు 4,99,619 ఓట్లు వచ్చాయి. అంటే టీఆర్‌ఎస్ కన్నాకాంగ్రెస్‌కే 9 వేల మెజార్టీ వచ్చింది. అలాంటప్పుడు ఇక్కడ రసవత్తర పోరు జరగాల్సి ఉండగా, అన్ని హంగులూ, ఆర్భాటాలతో అధికార పార్టీ ప్రచారంలో దూసుకెళ్తుంటే.. అన్నీ ఉన్నా ఎక్కడో ఏదో లోపించిన స్థితిలో కనీసం ఉనికి చాటుకునే స్థితిలో కూడా కాంగ్రెస్ ప్రచారంచేసుకోలేకపోతోంది. ఇక, బీజేపీ పక్షాన జాటోతు హుస్సేన్ నాయక్, సీపీఐ నుంచి కల్లూరి శ్రీనివాసరావుతో పాటు న్యూ డెమొక్రసీ పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్నా.. ప్రభావం నామమాత్రమే.
నాయక్ రాత మార్చిన ‘పేట’
2014 సార్వత్రిక ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం బలరాం నాయక్ రాతను మార్చిందనే చెప్పాలి. ఆయన 35 వేలకు పైగా ఓట్ల తేడాతో టీఆర్‌ఎస్ అభ్యర్థి సీతారాం నాయక్ చేతిలో ఓడిపోయారు. అయితే, నర్సంపేటలో జరిగిన క్రాస్ ఓటింగే ఇందుకు కారణమని లెక్కలు చెబుతున్నాయి. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో దొంతి మాధవరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయనకు ఆటో గుర్తు వచ్చింది. అయితే, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి న్యూడెమొక్రసీ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థికి కూడా ఆటో గుర్తే వచ్చింది. దీంతో ఓటర్లు మాధవరెడ్డి కోసం లోక్‌సభ బ్యాలెట్‌లోని ఆటో గుర్తుకు ఓటేసినట్టు ఫలితాలు చెబుతున్నాయి. ఒక్క నర్సంపేట నియోజకవర్గంలోనే న్యూ డెమొక్రసీ అభ్యర్థి ఆటో గుర్తుకు 70వేలకు పైగా ఓట్లు రాగా, బలరాం నాయక్ ఓడిపోయింది అందులో సగం ఓట్ల తేడాతోనే కావడం గమనార్హం.
అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎవరి బలమెంత?
డోర్నకల్: కాంగ్రెస్ కేడర్ డల్
ఇక్కడ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత తండ్రి, మాజీ మంత్రి డి.ఎస్.రెడ్యానాయక్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో రెడ్యానాయక్‌పై గెలిచి ఎమ్మెల్యేగా పనిచేసిన సత్యవతి రాథోడ్ కూడా ఇప్పుడు టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారు. ఆమె ఎమ్మెల్సీ కూడా. దీంతో ఇరు వర్గాల మధ్య సమన్వయం కొంత కొరవడిందనే అభిప్రాయం ఉంది. సత్యవతి మంత్రి అవుతారనే ప్రచారం కూడా రెడ్యా వర్గానికి తలనొప్పులు తెచ్చి పెడుతోంది. అయితే, క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న టీఆర్‌ఎస్ వైపే ఓటర్లు మొగ్గుచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి కూడా సంస్థాగత బలం ఉన్నా పోలింగ్ కేంద్రం వరకు ఓటరును తీసుకెళ్లే కేడర్ కరువైంది. నిశ్శబ్ద ఓటింగ్‌పై పార్టీ ఆధారపడింది.
మహబూబాబాద్: సానుభూతి ఎంత?
ఇక్కడ కూడా టీఆర్‌ఎస్ నుంచి శంకర్‌నాయక్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆమె ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అభివృద్ధి జరిగినా కొంత వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్ ఓడిపోయారు. ఇప్పుడు ఆయనే ఎంపీ అభ్యర్థి కావడంతో ఈ రెండు అంశాల్లో ఆయనకు సానుకూలత ఉంటుందనే అంచనా ఉంది. కానీ, టీఆర్‌ఎస్ సంస్థాగత బలం ముందు ఈ సానుభూతి నిలబడుతుందా అన్నది సందేహాస్పదమే.
నర్సంపేట: నిశ్శబ్ద ఓటింగ్?
టీఆర్‌ఎస్ ప్రాబల్యం బలంగా ఉన్న ఇక్కడ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో పాటు పార్టీ నేతలు, కేడర్ కూడా కవిత విజయం కోసం పని చేస్తున్నారు. కాంగ్రెస్ పక్షాన దొంతి మాధవరెడ్డి బలమైన నాయకుడు. నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న మాధవరెడ్డి పూర్తిగా క్రియాశీలకం అయితేనే ఇక్కడ కాంగ్రెస్‌కు కొన్ని ఓట్లు వచ్చే అవకాశముంటుంది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు ఉన్న ఒకే ఒక్క బలం మాధవరెడ్డి. ఆయన మీద ఉన్న నమ్మకం, సానుభూతితో పాటు నిశ్శబ్ద ఓటింగ్ జరుగుతుందని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది.
ములుగు: రెండూ రెండే..
కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అలియాస్ ధనసూరి అనసూయకు ములుగు నియోజకవర్గంలో మంచి పట్టుంది. గిరిజన, అటవీ ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు మంచి కేడర్ కూడా ఉంది. ఓ దశలో సీతక్కనే మహబూబాబాద్ పార్లమెంటు బరిలో దింపాలని కాంగ్రెస్ అధిష్టానం భావించింది కూడా. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆమెపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. అయితే, టీఆర్‌ఎస్ కూడా ఇక్కడ సంస్థాగత బలం కలిగి ఉంది. ఈ నియోజకవర్గంలో ఇరు పార్టీలు హోరాహోరీ తలపడుతున్నాయి.
ఇల్లెందు: సడీచప్పుడు లేదు
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే హరిప్రియానాయక్ టీఆర్‌ఎస్ గూటికి చేరారు. ఇక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన కోరం కనకయ్య కూడా పార్టీలోనే ఉన్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య సమన్వయం కొంత కష్టమనే భావన ఉంది. హరిప్రియ పార్టీ మార్పు కూడా కొంత చర్చనీయాంశమే అవుతున్నా పెద్దగా ప్రతికూల వాతావరణం ఏమీ లేదు. అభివృద్ధి జరిగితే చాలనే భావన ఇక్కడి ప్రజల్లో కనిపిస్తోంది. కాంగ్రెస్‌కున్న పాత కేడర్, నేతలు మొక్కుబడిగా ప్రచారం చేస్తున్నారు. టీఆర్‌ఎస్ ప్రచారంలో కూడా పెద్ద స్పీడ్ కనిపించడం లేదు. ఇక్కడ కొంతమేర టీఆర్‌ఎస్‌కు సానుకూలత కనిపించింది.
పినపాక: మూడు పార్టీల ప్రభావం..
ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన రేగా కాంతారావు టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు ప్రకటించారు. అప్పటికే పార్టీలో ఉన్న పాయం వెంకటేశ్వర్లుకు తోడు రేగా కాంతారావు ఇక్కడ టీఆర్‌ఎస్‌కు అదనపు బలం అయ్యారు. అయితే, టీఆర్‌ఎస్‌లో ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయులు ఈ ఎన్నికలను పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. రేగాతో పాటు 50 శాతం మంది కాంగ్రెస్ నేతలు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లినా మిగిలిన సంపద్రాయ ఓటు బ్యాంకుపైనే కాంగ్రెస్ ఇక్కడ ఆశలు పెట్టుకుంది. ఇక్కడ బీజేపీ కూడా కొంత ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇప్పటికే మూడుసార్లు పర్యటించారు. బలరాం నాయక్ కూడా భద్రాచలంలో ఎక్కువ సమయం గడుపుతూ పినపాక, ములుగు నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి పని చేస్తున్నారు.
భద్రాచలం: పై‘చేయి’ ఎవరిది?
కాంగ్రెస్ ఎమ్మెల్యే పోడెం వీరయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు కొంత ఆధిక్యత లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ సంస్థాగత బలం లేకపోవడం టీఆర్‌ఎస్‌కు పెద్ద మైనస్‌గా కనిపిస్తోంది. స్థానిక నేతలు కూడా అంత చురుకుగా లేరు. మంత్రి దయాకర్‌రావు వచ్చి కొంత సమన్వయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఎమ్మెల్యేగా గెలుపొందిన ఉత్సాహం, సంప్రదాయ ఓటుబ్యాంకు, తెలుగుదేశం శ్రేణులపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. ఇతర పార్టీల ప్రభావం పెద్దగా ఉండే అవకాశం లేదు.
జోరు మీదున్న ‘కారు’
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం కనిపించగా.. ఇప్పుడు పూర్తిగా సీన్ మారిపోయింది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ గట్టి పట్టు సాధించింది. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాలోతు కవిత రాజకీయ కుటుంబం నుంచే రావడం, గతంలో ఆమె ఎమ్మెల్యేగా, ఆమె తండ్రి మంత్రిగా పనిచేసి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉండటం, ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కలిసికట్టుగా పనిచేస్తుండడం టీఆర్‌ఎస్‌కు మంచి బలాన్ని తెచ్చిపెట్టాయి. దీనికి తోడు ప్రచారంలో కూడా టీఆర్‌ఎస్ జోరుగా దూసుకెళ్తోంది. వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈ స్థానానికి ఇన్‌చార్జిగా ఉండడంతో కవిత విజయం కోసం ఆయన శ్రమిస్తున్నారు. ఇతర నేతలతో సమన్వయం చేసుకుంటూ ఆయన ప్రచారంలో ఊపు తెస్తున్నారు. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌కు సంస్థాగతంగా ఉన్న బలం (ఒకటి, రెండు నియోజకవర్గాలు మినహా) ఆ పార్టీకి కొండంత అండ అనే చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తోడు థర్డ్‌ఫ్రంట్ పేరుతో కేసీఆర్ చెబుతున్న ఎన్నికల లాజిక్ కూడా ఇక్కడ పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఇల్లెందు, పినపాక, నర్సంపేట, డోర్నకల్, మహబూబాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో టీఆర్‌ఎస్ పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించే పరిస్థితులు ఉండగా, భద్రాచలం, ములుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గట్టి పోటీ ఉన్నా తమదే పైచేయి అవుతుందని గులాబీ సేన అంచనా వేస్తోంది. కచ్చితంగా విజయం సాధిస్తామనే ధీమా ఇక్కడి పార్టీ శ్రేణుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
కాంగ్రెస్ బేజారు
మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను నాలుగు చోట్ల విజయం సాధించడం, టీఆర్‌ఎస్ కన్నా దాదాపు 9 వేల ఓట్లు ఎక్కువ పోలవడం లాంటి సానుకూల అంశాలను ఈ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పూర్తిగా వినియోగించుకోలేకపోతోంది. గెలిచిన నలుగురిలో ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో కలుస్తున్నట్టు ప్రకటించడంతో కేవలం రెండు నియోజకవర్గాల్లో ప్రభావం మీదనే ఆధారపడి కాంగ్రెస్ ఈ ఎన్నికలను ఎదుర్కొంటోంది. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన పి.బలరాం నాయక్ ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నా ప్రచారంలో ఎక్కడా ఊపు కనిపించడం లేదు. సంస్థాగతంగా పార్టీకి కొంత పట్టు ఉన్నప్పటికీ దానిని సద్వినియోగం చేసుకుని పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లే కేడర్ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. పోలింగ్ మాట అటుంచితే ప్రచారం కూడా కనీస స్థాయిలో నిర్వహించలేని పరిస్థితి కాంగ్రెస్‌లో నెలకొంది. స్వయంగా అభ్యర్థి బలరాం నాయకే పార్టీ ప్రచార తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేయడం అక్కడ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. అయితే, ఎమ్మెల్యేలు పార్టీ మారినా, కార్యకర్తలు తమతోనే ఉన్నారని, గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేసిన వారంతా మళ్లీ ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారని, నిశ్శబ్ద ఓటింగ్ తమకు జరుగుతుందనే ధీమాతోనే చప్పగా ఎన్నికల పోరు సాగిస్తోంది.
ఎవరు గెలుస్తరో..– పెరుమాండ్ల మల్లేశం, జంగిలిగొండ, మహబూబాబాద్
ఎవరు గెలుస్తరో అర్థమయితలేదు. ఓటును ఎవరెలా ఉపయోగిస్తారనేది అర్థం కాకుండా ఉంది. పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్సే వస్తదన్నరు. కానీ టీఆర్‌ఎస్ గెలిచింది. ఈసారి ఏమయితదో.. ఆడికి పోయినంక ఓటరుకు ఏం బుద్ధి పుడతదో.
పనులు కావాలంటే..– మల్లుల ఉమాశంకర్, చిరువ్యాపారి, ఇల్లెందు
ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే, నాలుగు పనులు జరగాలంటే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటే అదే పార్టీకి చెందిన ఎంపీ ఉండాలి. అప్పుడే ఈ ప్రాంతానికి నిధులు వస్తాయి. పనులు అయితాయి. అందుకే అంతా టీఆర్‌ఎస్ వైపే ఆలోచిస్తున్నారు. నేను కూడా టీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలనుకుంటున్నాను.
2014లోక్‌సభఎన్నికల్లోఏ పార్టీకిఎన్ని ఓట్లు
మొత్తం పోలైన ఓట్లు : 11,24,370
సీతారాం నాయక్ (టీఆర్‌ఎస్) : 3,20,569
బలరాం నాయక్ (కాంగ్రెస్) : 2,85,577
లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లు:నర్సంపేట, డోర్నకల్, మహబూబాబాద్, ములుగు, ఇల్లెందు, పినపాక, భద్రాచలం.
లోక్‌సభ ఓటర్లు
పురుషులు 7,01,921
మహిళలు 7,21,383
ఇతరులు 47
మొత్తం ఓటర్లు 14,23,351
Comments
Please login to add a commentAdd a comment