
అశోక్ తన్వర్, సంజయ్ నిరుపమ్
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ/ముంబై: త్వరలో జరగనున్న మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీల కీలక పరిణామాలు సంభవించాయి. టికెట్ల కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందంటూ పలువురు నేతలు ఢిల్లీలోని పార్టీ చీఫ్ సోనియా నివాసం ఎదుట నిరసనలకు దిగారు. ఈ ఆరోపణలతో హరియాణా రాష్ట్ర మాజీ చీఫ్ అశోక్‌తన్వర్ పార్టీ ఎన్నికల కమిటీల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అయితే, పార్టీ సాధారణ కార్యకర్తగా కొనసాగుతానన్నారు.
రాష్ట్రంలో టికెట్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయంటూ పార్టీ చీఫ్ సోనియా నివాసం ఎదుట తన్వర్ అనుచరులు కొందరు బుధవారం నిరసన తెలిపారు. హరియాణాలో పార్టీ ‘హూడా కాంగ్రెస్’గా మారిపోయిందని మాజీ సీఎం భూపీందర్ హూడాపై సోనియా గాంధీకి రాసిన లేఖలో తన్వర్ ఆరోపించారు. ఆయనకు గులాంనబీ ఆజాద్ అండగా ఉన్నారన్నారు. గత ఐదేళ్లుగాపార్టీకి ద్రోహం చేసిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. 90 టికెట్లలో 50 వరకు తనవారికే హూడా కేటాయించుకున్నారని పేర్కొన్నారు.
ఈ పరిణామాలతో తీవ్ర నిరాశతో పార్టీ ఎన్నికల కమిటీల నుంచి రాజీనామా చేస్తున్నానని, ఇకపై సాధారణ కార్యకర్తగా మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేశారు. పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పోటీ చేయాలా వద్దా అనేది తన మద్దతుదారులకే వదిలేస్తున్నానన్నారు. అదేవిధంగా ముంబైలో..అభ్యర్థుల టికెట్ల కేటాయింపులపై కాంగ్రెస్‌లో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. తను సూచించిన ఒకే ఒక్క అభ్యర్థికి టికెట్ ఇవ్వనందుకు నిరసనగా పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొనబోనని ముంబై విభాగం మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్ ప్రకటించారు. ‘పార్టీ నుంచి వైదొలిగే సమయం రాలేదని భావిస్తున్నా. కానీ, పార్టీ వైఖరి నా సేవలు అవసరం లేదని భావిస్తున్నట్లుగా ఉంది. దీన్నిబట్టి ఆ రోజు కూడా ఎంతో దూరంలో లేదనుకుంటున్నా’అని ట్విట్టర్‌లో ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment