
సాక్షి ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ వైపు ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటుండగా మరోవైపు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. వాశీంలో ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి కాలేదని ఓ కార్యకర్త ఆత్మహత్యకు ప్రయత్నించగా మరోవైపు చంద్రాపూర్ జిల్లాలో జహీర్ సయ్యద్ అనే ఉపాధ్యాయుడు సెలవు కోసం రాసిన లేఖ సోషల్ మీడియాలో హల్ చేస్తోంది.
ఆయన లేఖను బట్టి రాష్ట్ర రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు రాజకీయ నేతలు కార్యకర్తలతోపాటు సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నది స్పష్టమైంది. ఉదయం లేవగానే రాష్ట్రంలో తారుమారైన పరిస్థితులను చూసి తాను అస్వస్థతకు గురయ్యానని అందుకే తనకు శనివారం ఒక రోజు సెలవు కావాలని తన పై అధికారికి లేఖ రాశాడు. ఈ లేఖలో రాçష్ట్రంలో ఈ రోజు వచ్చిన రాజకీయ భూకంపంతో తాను అస్వస్థతకు గురయ్యానని దీంతో తనకు సెలవు మంజూరు చేయాలని వినతి చేశారు. అయితే ఉపాధ్యాయుడి లీవ్ లెటర్‌ను కాలేజ్ ప్రిన్సిపల్ తిరస్కరించారు.
చదవండి: మఫ్టీలో పోలీసులు అడ్డంగా దొరికిపోయారు!
నాయకుడు సీఎం కాకపోవడంతో..
శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి కాకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన శివసేన కార్యకర్త రమేష్ జాధవ్ ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ సంఘటన వాశీంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. రాష్ట్రంలో శుక్రవారం రాత్రి వరకు శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి కానున్నారని ఆయన నేతృత్వంలో రాష్ట్రంలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానుందని భావించిన సంగతి తెలిసిందే. అయితే రాత్రికి రాత్రే ఊహించని పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో భారీ ట్విస్ట్ వచ్చాయి. తెల్లారేసరికి ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరోసారి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌లు ప్రమాణస్వీకారం కూడా చేసిన సంగతి తెలిసిందే.
చదవండి: ‘మహా’ మహిళ..మూడో కంటికి తెలియదు
ఇలాంటి సంఘటనతో అనేక మంది షాక్‌కు గురయ్యారు. వాశీంలో జిల్లా ఉమరీ గ్రామానికి చెందిన రమేష్ జాధవ్ ఈ సంఘటనను జీర్ణించుకోలేకపోయాడు. తీవ్ర నిరాశకు గురైన ఆయన జిల్లా హెడ్ క్వార్టర్ వాశీంలో బ్లేడ్‌తో శరీరాన్ని కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే రక్తం మడుగులో పడి ఉన్న రమేష్ జాధవన్‌ను గమనించిన ఓ ట్రాఫిక్ పోలీసు అతన్ని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని దిగ్రస్ పోలీసులు తెలిపారు. ఇక తాజా రాజకీయ ట్విస్టుల నేపథ్యంలో శివసేన ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే, ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్‌లతో ఫొటో దిగి పవార్ కుమార్తె సుప్రియా సూలే ట్విటర్‌లో పెట్టారు.
With Aaditya Thackeray (@AUThackeray), Sanjay Raut (@rautsanjay61) Ji and Rohit Pawar (@RohitPawarOffic) pic.twitter.com/M1MQwk9ylz
— Supriya Sule (@supriya_sule) November 24, 2019