
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వియ్యంకుడైన రిటైర్డ్ అధికారి వెంకట్రామ్‌రెడ్డిని నాబార్డు డైరెక్టరుగా నియమించడం ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, వెంటనే మంత్రివర్గం నుంచి ఈటలను భర్తరఫ్ చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి కొనగల మహేశ్ డిమాండ్ చేశారు.
గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హార్టికల్చర్ శాఖలో ఉద్యోగ విరమణ చేసినరోజే వెంకట్రామ్‌రెడ్డిని నాబార్డు డైరెక్టరుగా నియమిస్తూ, చట్టవిరుద్ధంగా ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందన్నారు. రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులను సర్వీసులో కొనసాగించరాదని ఆర్థిక శాఖ గతంలోనే స్పష్టమైన ఆదేశాలను జారీచేసిందని గుర్తుచేశారు. అదే శాఖకు మంత్రిగా ఉన్న ఈటల తన వియ్యంకునికోసం నిబంధనలను, చట్టాన్ని ఉల్లంఘించారని, నాబార్డు నిధులను కాజేయడానికే ఈ నియామకం జరిగిందన్నారు.
నిరుద్యోగంలో తెలంగాణ మూడోస్థానంలో ఉందని, కానీ టీఆర్‌ఎస్‌లో పలుకుబడి ఉన్నవారంతా రెండుమూడు ఉద్యోగాలు పొందుతున్నారని మహేశ్ ఆరోపించారు. దీనిపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని, లేకుంటే హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.