సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి ఒక్క మంచి మాట అయినా కాంగ్రెస్ సభ్యులు చెప్పలేదని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారని, అసలు ఈ బడ్జెట్‌లో ఏదైనా మంచి ఉంటే గదా చెప్పడానికి అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి సమాధానం అనంతరం వివరణల్లో భాగంగా సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. తమది సంక్షేమ ప్రభుత్వమని, సంక్షేమ బడ్జెట్ అని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, సంక్షేమ ప్రభుత్వమైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థుల ఫీజులపై బడ్జెట్‌లో ఎందుకు కోత విధించిందని ప్రశ్నించారు. తమను కర్రు కాల్చి ప్రజలు వాతపెట్టారని ప్రభుత్వం అంటోందని, తమకేమీ ప్రజలు వాత పెట్టలేదని, అధికార పార్టీ సభ్యులను ఎలా గెలిపించారో, తమను కూడా ప్రజలు అలాగే గెలిపించారన్నారు. ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తిచూపేందుకు ప్రతిపక్ష సభ్యులుగా తమను సభకు పంపారని చెప్పారు.
మేడిగడ్డ నుంచి చుక్క నీరు కూడా ఎత్తిపోయలే..
ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గొప్ప లు చెప్పుకుంటోందని, ఈ ప్రభుత్వం గొప్పలు చెపుతున్నట్టు మేడిగడ్డ నుంచి చుక్క నీరు కూడా ఎత్తిపోయలేదని భట్టి విమర్శించారు. ఈ ప్రాజెక్టుకు అనుబంధంగా ఉండే శ్రీపాద ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ, కడెం, మిడ్‌మానేరు, లోయర్‌మానేరు ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ కట్టిందని, కాకతీయ కెనాల్, వరద కాల్వ కూడా తాము తవ్వినవేన ని టీఆర్‌ఎస్ గ్రహించాలన్నారు. రెప్పపాటు కూడా కరెంటు పో కుండా తామేదో చేశామని ప్రభు త్వం గొప్పలు చెబుతోందని, ఈ ప్రభుత్వం విద్యుదుత్పత్తికి అదనంగా చేసిందేమీ లేదన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యాదాద్రి, భద్రాద్రి ప్రాజెక్టుల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంతో ఒప్పందం తప్ప ఏమీ చేయలేదని, భద్రాద్రి, యాదాద్రి ఇంతవరకు పూర్తి కాలేదని, గత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన కృషి కారణంగానే రాష్ట్ర విద్యుత్ పరిస్థితి మెరుగుపడిందని చెప్పారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క రైతుకు కూడా ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదని ఆరోపించారు.
సీఎంను పిలిపించండి..
అంతకుముందు తన ప్రసంగంలో భాగంగా భట్టి మాట్లాడుతూ.. తమను అనాల్సినవి అన్నీ అనేసి సీఎం కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రతిపక్షం చెప్పే సూచనలను సీఎం వింటే బాగుంటుందని వెంటనే పిలిపించాలని స్పీకర్‌ను కోరారు. ఈ సందర్భంగా అధికార పక్షం అడ్డుకునే ప్రయత్నం చేయగా స్పీకర్ పోచారం రాజకీయ వ్యాఖ్యలు కాకుండా బడ్జెట్ గురించి మాట్లాడాలని భట్టికి సూచించారు. దీనిపై స్పందించిన భట్టి ‘మాకు స్పీకర్ స్థానంపై గౌరవముంది. మేం మాట్లాడేటప్పుడు కట్టడి చేస్తాం. వాళ్లకు మాత్రం మమ్మల్ని తిట్టేందుకు అవకాశం ఇస్తాం అనడం మాత్రం సరైంది కాదు.’అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత హరీశ్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వడంలో స్పీకర్ ఉదారంగా వ్యవహరిస్తున్నారని, ఆయననుద్దేశించి భట్టి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలన్నారు. బడ్జెట్‌పై కాంగ్రెస్ సభ్యులు ఎంతసేపు మాట్లాడారో హరీశ్ సభకు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment