బంకురా/పురూలియా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అభ్యర్థులు అక్రమంగా బొగ్గు తవ్వకాలకు పాల్పడుతున్నారంటూ మోదీ చేసిన ఆరోపణలను రుజువుచేయలేకపోతే ఆయన వంద గుంజీలు తీయాలని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. అదే మోదీ తాను చేసిన ఆరోపణలను ఏ ఒక్క అభ్యర్థిపైనైనా రుజువు చేస్తే లోక్‌సభ బరిలో ఉన్న మొత్తం 42 మంది టీఎంసీ అభ్యర్థులను పోటీ నుంచి ఉపసంహరిస్తానని ఆమె సవాల్ విసిరారు. గురువారం బెంగాల్‌లోని బంకురా నియోజకవర్గంలో మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ టీఎంసీ అభ్యర్థులు అక్రమంగా బొగ్గు తవ్వకాలకు పాల్పడి డబ్బు సంపాదిస్తున్నారని ఆరోపించారు.
అనంతరం మమత కూడా అదే నియోజకవర్గంలోని ఓ సభలో మాట్లాడుతూ ‘బొగ్గు గనుల తవ్వకాల వ్యవహారమంతా కేంద్రంలోని బొగ్గు మంత్రిత్వ శాఖ అధీనంలో ఉంటుంది. గనులకు కాపలాగా ఉండేది కూడా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్‌ఎఫ్). బొగ్గు గనులను అక్రమంగా తవ్వుతున్నది బీజేపీ వాళ్లే’ అంటూ మోదీపై ఎదురుదాడి చేశారు. తన దగ్గర ఒక పెన్‌డ్రైవ్ ఉందనీ, దాన్ని బయటపెడితే బొగ్గు మాఫియా, పశువుల అక్రమ రవాణాకు సంబంధించిన కళ్లు చెదిరే నిజాలు వెలుగుచూస్తాయని మమత హెచ్చరించారు. ఓ కేంద్ర మంత్రి, మరో బీజేపీ ఎంపీకి సంబంధించిన వివరాలు ఆ పెన్‌డ్రైవ్‌లో ఉన్నాయన్నారు. చిట్‌ఫండ్ కుంభకోణాల్లో టీఎంసీ నేతలపై వచ్చిన ఆరోపణలు కూడా రుజువుకాలేదని ఆమె పేర్కొన్నారు. ఈ దేశాన్ని దుర్యోధన, దుశ్శాసనులు పాలిస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ద్వయంపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
మోదీని కొడతానని నేను అనలేదు..
మోదీని చెంపదెబ్బ కొడతానని తానెప్పుడూ అనలేదని మమత స్పష్టం చేశారు. ఆయనను కొట్టాల్సిన అవసరం తనకు ఏంటని ఆమె ప్రశ్నించారు. బుధవారం మమత మాట్లాడుతూ ప్రజాస్వామ్యపు చెంపదెబ్బను మోదీ రుచి చూస్తారని అనడం తెలిసిందే. దీనిపై మోదీ గురువారం మాట్లాడుతూ ‘మమత నన్ను కొడతానంటున్నారు. ఆమె నాకు అక్క వంటివారు. ఆమె కొట్టినా నాకు అది ఆశీర్వాదమే’ అని పేర్కొన్నారు. దీంతో మమత మాట్లాడుతూ మోదీ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని, వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యపు చెంపదెబ్బను మోదీ రుచి చూస్తారని తాను అన్నానే తప్ప, తానే మోదీని చెంపదెబ్బ కొడతానని కాదని వెల్లడించారు. ప్రజలే తమ ఓటుతో మోదీకి బుద్ధి చెబుతారనే అర్థంలో తాను ‘ప్రజాస్వామ్యపు చెంపదెబ్బ’ అన్నానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment