
వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన మాజీ మంత్రి మహీధర్‌రెడ్డి. పక్కన పార్టీ నేతలు
సాక్షి, తిరుపతి: ‘నా ఇష్టదైవం షిరిడీ సాయినాధుని సన్నిధిలో నిర్ణయం తీసుకున్నాను. పనిచేస్తున్న చేయికి మా చేతులు జోడించాలని భావించాను. ప్రజలకు మేలు చేసే పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాను. నియోజకవర్గ ప్రజల కోసం, వారి అభీష్టం మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఈనెల 11న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో చేరుతున్నాను’ అని మాజీ మంత్రి, ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మానుగుంట మహీధర్‌రెడ్డి ప్రకటించారు.
తిరుపతిలోని సాయిబాబ మందిరంలో శనివారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయం వెలుపల వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి, మాజీ ఎంపీ వరప్రసాదరావు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలతో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన నిర్ణయాన్ని ప్రకటించారు. అంతకుముందు విజయసాయిరెడ్డి, భూమన కరుణాకరరెడ్డి మాట్లాడారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజారంజక పాలన అందించారన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన ప్రారంభించిన పథకాలను కొనసాగించాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రజల్లో మేమకమవుతున్నారని తెలిపారు.