సాక్షి,హైదరాబాద్: తెలంగాణ జనసమితి(టీజేఎస్)కి ఎన్నికల సంఘం కేటాయించిన అగ్గిపెట్టె గుర్తును పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థులకూ కేటాయించింది. ఈ ఎన్నికల్లో టీజేఎస్ కేవలం 8 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుండటంతో మిగిలిన నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థుల కోసం ఈ గుర్తును ఈసీ అందుబాటులో ఉంచింది. 111 స్థానాల్లో అగ్గిపెట్టె గుర్తును కేటాయించాలని అడిగిన స్వతంత్ర అభ్యర్థులకు కూడా ఈ గుర్తును కేటాయించింది. తొలుత రాష్ట్రం లోని 119 స్థానాల్లోనూ పోటీ చేస్తామని అన్ని స్థానాలకు ఉమ్మడి గుర్తును కేటాయించాలని టీజేఎస్ చేసిన విజ్ఞప్తిని ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుని ఆ పార్టీకి అగ్గిపెట్టె గుర్తును కేటాయించింది. అయితే మహాకూటమిలో భాగస్వామ్య పార్టీగా చేరిన టీజేఎస్ కూటమి తరఫున మల్కాజ్‌గిరి, సిద్దిపేట, అంబర్‌పేట, వర్ధన్నపేట స్థానాల్లో పోటీ చేస్తుండగా ఆసిఫాబాద్, ఖానాపూర్, వరంగల్ ఈస్ట్, దుబ్బాక స్థానాల్లో స్నేహపూర్వక పోటీ నిమిత్తం అభ్యర్థులను బరిలో నిలిపింది. ఈనెల 22న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ అనంతరం నియోజకవర్గాల వారీగా పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాలు సిద్ధమయ్యాయి. ఎన్నికల బ్యాలెట్లను ముద్రించడంలో భాగంగా అదేరోజు గుర్తింపు రాజకీయ పార్టీల అభ్యర్థులకు శాశ్వత ఎన్నికల గుర్తులతో పాటు గుర్తింపు లేని రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులకు ముందే రిజర్వు చేసిన గుర్తులను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు కేటాయించారు.
అడిగిన వారికి మాత్రమే..
ఆ తర్వాత జాబితాలో మిగిలిపోయిన గుర్తులను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించారు. ఎనిమిది స్థానాల్లో టీజేఎస్ అభ్యర్థులకు అగ్గిపెట్టె గుర్తును కేటాయించారు. మిగిలిన స్థానాల్లో ఆ పార్టీ కోసం రిజర్వు చేసిన అగ్గిపెట్టె గుర్తు మిగిలిపోయింది. దీంతో ఈ గుర్తు 111 నియోజకవర్గాల్లో ఆ గుర్తు కావాలని అడిగిన స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ ఈ గుర్తును కేటాయించింది.
అభ్యర్థుల వినతి మేరకే..
రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు అగ్గిపెట్టె గుర్తును కేటాయిం చాలని కోరడంతో స్థానిక రిటర్నింగ్ అధికారులు ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) కార్యాలయానికి నివేదించారు. కొత్తగా ఏర్పడిన టీజేఎస్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇంకా గుర్తింపు లభించలేదని, గుర్తింపు లేని రిజిస్టర్డ్ పార్టీల కోసం రిజర్వు చేసిన ఎన్నికల గుర్తును ఆ పార్టీలు పోటీ చేయని స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించవచ్చని సీఈఓ కార్యాలయం వివరణ ఇచ్చింది. ఎన్నికల బ్యాలెట్‌లో పార్టీ పేరు స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నప్పటికీ, ఓటర్లు గందరగోళానికి గురై టీజేఎస్ అభ్యర్థిగా భావించి ఓటేసే అవకాశాలు ఉండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment