న్యూఢిల్లీ: ఆడియో టేపుల వ్యవహారం రాజస్తాన్ రాజకియాల్లో మరింత దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి రాజస్తాన్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మతో కలిసి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ నేత సంజయ్ జైన్ కుట్రలు పన్నారని కాంగ్రెస్ రాజస్తాన్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌ఓజీ)నకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ మహేష్ జోషి ఫిర్యాదు మేరకు ఎస్‌ఓజీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. అయితే, ఫేక్ ఆడియో టేపులతో రాజకీయంగా తమపై బురదజల్లే యత్నం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అదే విధంగా ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపాలని డిమాండ్ చేశారు. (రాజస్తాన్ హైడ్రామా: పోలీసులకు బీజేపీ ఫిర్యాదు)
ఇక దీనిపై మాయావతి స్పందిస్తూ.. రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ మొదట ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని ఉల్లంఘించారని మండిపడ్డారు. బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకున్నారని దుయ్యబట్టారు. ఆడియో టేపుల విషయంలో మరో చట్టవిరుద్ధమైన నిర్ణయం తీసుకున్నారని తీవ్రంగా విమర్శించారు. రాజస్తాన్‌లో రాష్ట్రపతి పాలనను గవర్నర్ సిఫార్సు చేయాలన్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభన, అస్థిరతను గవర్నర్ పూర్తిస్థాయిలో తెలుసుకొని రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాయావతి ట్విటర్‌లో పేర్కొన్నారు. (‘105 మంది ఎమ్మెల్యేల్లో కొందరు టచ్‌లో ఉన్నారు’)
Comments
Please login to add a commentAdd a comment