
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశాలు ఉన్నాయి. శుక్రవారం జరిగిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో అజహరుద్దీన్ అధ్యక్షుడిగా గెలిచారు. ఈ నేపథ్యం లో సీఎం కేసీఆర్‌తోపాటు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీకి అజహరుద్దీన్ అపాయింట్‌మెంట్ కోరారు. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఎన్నిౖకైన అనంతరం అజహర్ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ను రాష్ట్రానికి బాస్‌గా అభివర్ణించారు. టీఆర్‌ఎస్‌లో చేరికపై ప్రశ్నించగా.. రాజకీయాలకు ఇది సందర్భం కాదని వ్యాఖ్యా నించారు. అయితే శనివారం సీఎంతో భేటీ అనంతరం అజహర్ చేరికపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఇన్నా ళ్లూ హెచ్‌సీఏ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ ఎంపీ జి.వివేక్‌కు చెక్ పెట్టేందుకు అజహర్‌కు టీఆర్‌ఎస్ పరోక్ష సహకారమందించింది. అజహర్‌కు మద్దతు కూడగట్టడంలో ఓ మహిళా మంత్రి, ఆమె కుమారుడు కీలక పాత్ర పోషించినట్లు హెచ్‌సీఏ వర్గాల సమాచారం.
హుజూర్‌నగర్ ఉపఎన్నిక నేపథ్యంలోనే..?
హుజూర్‌నగర్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి సతీమణి పద్మావతి కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్నారు. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఇక్కడ టీఆర్‌ఎస్ గెలవకపోవడంతో ఉపఎన్నికను అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అజహర్‌తోపాటు మరికొందరు కాంగ్రెస్ ముఖ్య నేతలను చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ ఆత్మస్థైర్యం దెబ్బ తీయడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ పావులు కదుపుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment