సాక్షి, పశ్చిమ గోదావరి : తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను అచ్చు వేసిన ఆంబోతులా వదిలేసి తమపై అక్రమంగా కేసులు పెడతారా అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున విరుచుకుపడ్డారు. కోట్ల రూపాయల అవినీతి అందించాడు గనుకే చింతమనేని అంటే చంద్రబాబుకు భయమని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళితులపై చింతమనేని వ్యాఖ్యలు దారుణమన్నారు. దళితులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన చింతమనేనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. దళిత కార్మికుడు రాచేటి జాన్‌ను గతంలో ఇంటికి పిలిచి మరీ కొట్టినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదన్నారు. చింతమనేని దళితులను బూతులు తిడితే ప్రభుత్వం కళ్లు మూసుకుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చింతమనేని మాట్లాడిన దానినే దళిత నేత కత్తుల రవి షేర్ చేస్తే మార్ఫింగ్ చేశారని తప్పుడు కేసులు పెడతారా అంటూ మండిపడ్డారు. దళితులకు అన్యాయం జరిగితే ఎస్సీ కమీషన్ ఛైర్మన్ కారెం శివాజీ ఏం చేస్తున్నారు.. దళితులంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకంత చులకన అని ఆవేదన వ్యక్తం చేశారు. 40 పేజీలపై సంతకాలు తీసుకుని రవిని భయపెట్టాలని చూశారన్నారు. రవిపై పెట్టిన కేసులను వెంటనే తొలగించాలని, చింతమనేనిని అరెస్ట్ చేయకపోయినా.. రవిపై కేసులు ఎత్తివేయకపోయినా ఈ అన్యాయంపై రాష్ట్రంలోని ప్రతీ గడపా తడతామని తేల్చిచెప్పారు. చంద్రబాబు దళిత ద్రోహిగా మిగలబోతున్నాడన్నారు. ‘వంద కోట్ల రూపాయల అంబేద్కర్ స్మృతివనం ఏం చేశావు.. కారెం శివాజీ! చంద్రబాబు దగ్గర ఎస్సీ కమీషన్‌ను తాకట్టు పెట్టి నపుంసకుడిగా ఉండిపోయావ్’ అంటూ విమర్శించారు. ప్రభుత్వాలు మారుతుంటాయని, పోలీసులు న్యాయం పక్షాన ఉండాలని చెప్పారు. కానీ ఏపీలో పోలీసులు చంద్రబాబు మనుషులుగా మారడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment