
జమ్మలమడుగు కో– ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ (టౌన్‌బ్యాంక్)లో జరిగిన రూ. 2 కోట్ల కుంభకోణం మంత్రి ఆదినారాయణరెడ్డిని రాజకీయంగా ఇరకాటంలో పడేసింది. వియ్యంకుడు కేశవరెడ్డి వందలకోట్ల ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో ఇరుక్కున్నారు. ఈ వివాదం ఇప్పటికీ మంత్రిని పట్టి పీడిస్తున్న నేపథ్యంలో సొంత నియోజకవర్గం జమ్మలమడుగులో తన బంధువు జనం సొమ్ము దిగమింగడం మంత్రికి ఇబ్బందిగా మారింది.
సాక్షి ప్రతినిధి – కడప
జమ్మలమడుగు టౌన్ బ్యాంకు పేరున లావాదేవీలు జరిపిన సమయంలో అనేక కారణాలతో బ్యాంకు దివాలా తీసింది. సహకార శాఖ ఈ బ్యాంకు లైసెన్సు రద్దు చేసినా, ఏదో ఒక విధంగా మళ్లీ నడపాలనే ఉద్దేశంతో క్రెడిట్ సొసైటీ పేరుతో వ్యాపారానికి అనుమతించింది. బ్యాంకు దివాలా తీసిన సమయంలో తాము ముందుండి నడిపిస్తామని మంత్రి ఆదినారాయణరెడ్డి కుటుంబం ఖాతాదారులకు నచ్చచెప్పింది.ఈ కారణం వల్లే రాష్ట్ర సహకార శాఖమంత్రి ఆదినారాయణరెడ్డి బంధువు తాతిరెడ్డి హృషికేశవరెడ్డి ఈ సొసైటీ పాలక వర్గానికి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.మంత్రి సోదరుడు, మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి గౌరవాధ్యక్షుడిగాను, మంత్రి తమ్ముడు శివనాథరెడ్డి డైరెక్టర్‌గాను వ్యవహరిస్తున్నారు. మంత్రి బావ, జమ్మల మడుగు మున్సిపల్ చైర్ పర్సన్ తులసి భర్త తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి వైస్ చైర్మన్‌గా ఉన్నారు. మంత్రి కుటుంబం, బంధువర్గం ఆధీనంలో నడుస్తున్న ఈ బ్యాంకులో ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు దాకా రూ 2 కోట్లు పక్క దారి పట్టింది. మంత్రి సమీప బంధువు, చైర్మన్ హృషి కేశవరెడ్డి ఈ సొమ్ము దిగమింగారు.
నెలరోజుల ముందే వెలుగులోకి
టౌన్ బ్యాంకులో లక్షల కొద్దీ డిపాజిట్లు చేసిన వ్యాపారులు నెల రోజుల ముందే అక్రమాల వ్యవహారం గురించి తెలుసుకున్నారు. అయితే ఈ బ్యాంకు లావాదేవీలన్నీ మంత్రి ఆదినారాయణరెడ్డి బంధువు, బ్యాంకు చైర్మన్ హృషి కేశవరెడ్డి కనుసన్నల్లో నడుస్తుండటంతో గొడవ పడితే తమ మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతారని వారు భయపడ్డారు. చైర్మన్‌ను బతిమలాడో, తమ బాధలు చెప్పుకునో ఏదో ఒక రకంగా సామరస్యంగా డబ్బులు వెనక్కు తీసుకోవడం కోసం చాలా సార్లు ఆయన్ను సంప్రదించారు. చూద్దాం, చేద్దాం అంటూ విషయం సాగదీస్తూ రావడంతో ఇక లాభం లేదనుకుని బాధితులు విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై సాక్షి వరుస కథనాలు ప్రచురించడంతో టౌన్‌బ్యాంకు అక్రమాల వ్యవహారం బట్టబయలైంది. అధికారులు స్పందించి చైర్మన్, సీఈవో మీద పోలీసు కేసు పెట్టడంతో పాటు, మంగళవారం చైర్మన్ ఆస్తులను అటాచ్‌మెంట్ చేశారు. తాము అటాచ్‌మెంట్ చేసిన ఆస్తులకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరపరాదని సంబంధిత అధికారులకు లేఖలు పంపారు. చైర్మన్ బ్యాంకు ఖాతాలను కూడా స్తంభింప చేయాలని బ్యాంకర్లను కోరడంతో పాటు హృషి కేశవరెడ్డికి నోటీసులు అందించారు.