సాక్షి, జమ్మలమడుగు: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం పెదదుండ్లూరులో దళిత కుటుంబాలపై దాడి, ఇళ్ల విధ్వంసం ఘటనలో మంత్రి ఆదినారాయరణ రెడ్డి కుటుంబం ప్రమేయానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయి. మంత్రి ఆది భార్య అరుణతోపాటు మంత్రి సోదరుడి భార్య సైతం దగ్గరుండిమరీ తమ అనుచరులకు ఆదేశాలిస్తోన్న వీడియోలు బహిర్గతమయ్యాయి. వైఎస్సార్‌సీపీ నేతలను ఇంటికి ఆహ్వానించారన్న కారణంతో నవవరుడు, పెద్దదండ్లూరు గ్రామానికి చెందిన ఏపీఎస్‌పీ కానిస్టేబుల్ సంపత్ ఇంటి మంత్రి అనుచరులు, టీడీపీ శ్రేణులు దాడికి తెగబడ్డారు. సుగమంచిపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ అభిమానులను కూడా తీవ్రంగా కొట్టారు. ఉద్రిక్తతల నేపథ్యంలో పెద్దదుండ్లూరు, సుగమంచిపల్లిలో సోమవారం కూడా పోలీస్ పికెట్ కొనసాగుతున్నది. (చదవండి: మంత్రి ఆది వర్గీయుల అరాచకం)
అనుచరులను పురమాయిస్తూ..: పెద్దదుండ్లూరు గ్రామంలో ఇటీవలే వివాహం చేసుకున్న కానిస్టేబుల్ సంపత్ దంపతులను ఆశీర్వదించేందుకు వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆ పార్టీ కీలక నేతలు ఆదివారం గ్రామానికి తరలివెళ్లారు. ఎంపీ వస్తున్నారన్న సమాచారం అందడంతో ఆయా గ్రామాల్లో తమ ఆధిపత్యానికి సవాలుగా భావించిన మంత్రి వర్గీయులు ధ్వంసరచన చేశారు. ముందుగా రౌడీమూకలను వెంటేసుకుని మంత్రి తనయుడు సుధీర్‌రెడ్డి, మంత్రి భార్య అరుణలు గ్రామంలో బీభత్సం సృష్టించారు. ‘మాకు తెలియకుండా వైఎస్సార్‌సీపీ నాయకులను ఆహ్వానిస్తారా?’ అంటూ దళిత కుటుంబాలపై దాడికి దిగారు. పెళ్లింటి ముందు వేసిఉన్న షామియానాలను చించిపారేశారు. పక్కనే ఉన్న సుగుమంచిపల్లి గ్రామంలో వైఎస్సార్‌సీపీలో చేరేందుకు సిద్ధమైన వీరారెడ్డి, అతని కుటుంబీకులను ఆది వర్గీయులు చావబాదారు. మంత్రి భార్య అరుణ, మంత్రి సోదరుడి భార్య.. సుగమంచిపల్లిలో ఓ ఇంట్లో కూర్చొని అనుచరులను పురమాయిస్తోన్న వీడియో దృశ్యాలు బయటికొచ్చాయి.
అర్ధరాత్రి తర్వాత ఎంపీకి అనుమతి..: పెద్దదండ్లూరు వెళ్లకుండా తనను అడ్డుకున్న పోలీసులపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతగల ఎంపీగా తన నియోజకవర్గంలో ఎక్కడికైనా వెళ్లే హక్కుందని, తనను అడ్డుకోవడం సరికాదని అన్నారు. అయినాసరే పట్టించుకోని పోలీసులు.. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై లాఠీచార్జి చేసి, నేతలను చింతకొమ్మదిన్నె పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఎట్టకేలకు ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఎంపీ అవినాష్, వైఎస్సార్‌సీపీ నేతలు గ్రామంలోకి వెళ్లి బాధితులను పరామర్శించారు. (చూడండి: మంత్రి బెదిరిస్తే భయపడం)
పోలీసులకు ఫిర్యాదు: పెద్దదుండ్లూరు, సుగమంచిపల్లిల్లో మంత్రి ఆదివర్గీయుల దాష్టీకాలపై బాధితులు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి వెంటరాగా, బాధితులు సుబ్బరామిరెడ్డి, సంపత్ జమ్మలమడుగు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. దళిత కుటుంబంపై దాడి చేయించిన మంత్రి ఆదినారాయణరెడ్డిపై కుల వివక్షవ్యతిరేక పోరాట సమితి(కేవీపీఎస్) సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే మంత్రిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment