
సాక్షి, వైఎస్సార్ జిల్లా : అధికార పార్టీలో ఆధిపత్య పోరు రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇటీవల మంత్రి అఖిలప్రియ- ఏవీ సుబ్బారెడ్డి మధ్య వివాదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలుగజేసుకుని వారికి సర్ది చెప్పారు. మినీ మహానాడు సమావేశంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఫైర్ అయిన విషయం విదితమే.
అయితే జమ్మలమడుగులో మరోమారు టీడీపీ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. వైఎస్సార్ జిల్లాలో రామసుబ్బారెడ్డి- మంత్రి ఆదినారాయణ రెడ్డిల మధ్య వివాదాలు తలెత్తాయి. నేతలు పోటా పోటీగా మినీ మహానాడు సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. శనివారం రామసుబ్బారెడ్డి మినీ మహానాడును ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం ఆదినారాయణ రెడ్డిల విడిగా మినీ మహానాడు ఏర్పాటు చేశారు. దీంతో నేతల మధ్య అధిపత్య పోరు మరింత పెరిగినట్లు కనిపిస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈ విధమైన సమస్యలు టీడీపీకి ఎదురు దెబ్బని చెప్పవచ్చు.