
ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి
సాక్షి, జమ్మలమడుగు : అధికార టీడీపీలో వివాదాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. గత కొద్ది రోజులుగా మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య విభేదాలపై రాష్ట్రంలో జోరుగా చర్చ జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో అధికారపార్టీ నేతల మధ్య మాటల యుద్దం చోటుచేసుకంది. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మంత్రి ఆదినారాయణరెడ్డిపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో ఎమ్మెల్యే టికెట్స్ ప్రకటించడానికి ఆదినారాయణ రెడ్డి ఎవరని ప్రశ్నించారు.
‘జమ్మలమడుగులో పోటీ చేసేది తానే అని ఆదినారాయణరెడ్డి ఎలా ప్రకటిస్తారు? ఎమ్మెల్సీ ఇచ్చే సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని హామీ ఇచ్చారు. ఎన్‌టీఆర్ హయాం నుంచి టీడీపీలో టికెట్స్ ప్రకటించే హక్కు మంత్రులకు, జిల్లా అధ్యక్షులకు లేదు. పార్టీ క్రమశిక్షణకు తూట్లు పొడుస్తున్నారు. లేని పోనీ ప్రకటనలు చేసి నియోజకవర్గంలో వర్గపోరు పెంచుతున్నారు’ అని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మండిపడ్డారు.