సభలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు
హుస్నాబాద్: ‘ఏ జన్మపుణ్యమో కేసీఆర్ నాకు నీళ్ల మంత్రి ఇచ్చిండు. ప్రజల రుణం తీర్చుకుంటా.. మరే పదవులు ఆశించను’’అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణ పనులకు సోమవారం మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ‘నాకు సేవ చేయాలని ఉంది. నేను ప్రజల సేవకుడిని, వారి రుణం తీర్చే భాగ్యం దక్కింది.. ప్రజలు సహకరిస్తే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తా’అని పేర్కొన్నారు.
ఎవరు అవునన్నా.. కాదన్నా మరో 20 ఏళ్లు రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు. వరద కాల్వ కోసం ఎన్నో పోరాటాలు చేశామన్నారు. తొమ్మిదేళ్ల క్రితం ఎస్సారెస్పీలో వరద వచ్చినప్పుడు, వానలు పడ్డప్పుడు మాత్రమే గౌరవెల్లి ప్రాజెక్టు నిండే అవకాశముండేదని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మిడ్‌మానేరు ద్వారా గౌరవెల్లి ప్రాజెక్టును నింపి రెండు పంటలకు నీళ్లు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తి చేయడంతో పాటు మిడ్‌మానేరు వద్ద 27 గేట్లు నిర్మించామన్నారు. వచ్చే వర్షాకాలం నాటికి పనులు పూర్తి చేస్తామని హరీశ్ తెలిపారు. కాంగ్రెస్ హయాంలో చిన్న చిన్న ప్రాజెక్టులు మాత్రమే కట్టారని, తక్కువ ముంపుతో ఎక్కువ లాభం జరగాలన్నదే కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే సతీష్‌కుమార్, సీఈ అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment