
సోమవారం కొండపోచమ్మసాగర్ నిర్వాసితుల కాలనీ పరిశీలిస్తున్న హరీశ్‌రావు
గజ్వేల్: సాగునీటి కష్టాలతో అల్లాడుతున్న తెలంగాణ రైతాంగాన్ని గట్టెక్కించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుండగా.. ప్రొఫెసర్ కోదండరాం దొడ్డిదారిన అడ్డుకునేందుకు ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో పర్య టించారు. ఈ సందర్భంగా ములుగు మం డలం తున్కిబొల్లారంలో కొండపోచమ్మసాగర్ నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న ఆర్‌అండ్‌ఆర్ కాలనీ పనులను పరిశీలించారు.
అనంతరం మర్కూక్‌లో నిర్వహించిన పౌరహక్కుల దినోత్సవంలో పాల్గొని, దళితులతో సహపంక్తి భోజనం చేశారు. వీటితో పాటు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశా రు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. కోదండరాం తీరుపై నిప్పులు చెరిగారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే సాగునీరు కావాలని ఉద్యమ సమయంలో డిమాండ్ చేసిన కోదండరాం.. ములుగు మండలం మామిడ్యాల, బహిలింపూర్, తానేదార్‌పల్లి గ్రామాల్లో కొండపోచమ్మసాగర్‌కు భూములివ్వొద్దంటూ కుట్రలు చేశారని మండిపడ్డారు. అంతేకాకుండా భూసేకరణ చట్టాల అమలుపై అపోహలు సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అయినా, కోదండరాం మాటలను నిర్వాసితులు నమ్మలేదన్నారు. సీఎం కేసీఆర్‌పై ఉన్న నమ్మకంతో పలువురు రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని గుర్తుచేశారు. వారి సహకారం వల్లే ఇప్పటి వరకు ఈ రిజర్వాయర్ పనులకోసం 4,634 ఎకరాలను సేకరించాల్సి ఉండగా.. ప్రస్తుతం 4,468 ఎకరాలు సేకరించగలిగామన్నారు.
అన్ని సౌకర్యాలతో కాలనీ..: నిర్వాసితులను ఆదుకునేందుకు ప్రభుత్వం మానవతాదృక్పథంతో వ్యవహరిస్తుందని హరీశ్‌రావు అన్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా ఒకప్పుడు నిర్వాసితుడు కావడం వల్ల... వారి కష్టాలు తెలుసని స్పష్టం చేశారు. సకల సౌకర్యాలతో తున్కిబొల్లారం వద్ద దేశంలో ఎక్కడా లేనివిధంగా కాలనీ పనులు జరుగుతున్నాయన్నారు.
ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు కాంగ్రెస్ నేతలకు కనిపించకపోవడం సిగ్గుచేటన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తోందన్నారు. దీనిపై సవాల్ చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. కేంద్ర ప్రభుత్వం దళితుల హక్కుల పరిరక్షణలో విఫలమైందని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో కానిస్టేబుల్ నియామకపు పరీక్షల్లో అభ్యర్థుల దేహాలపై ఎస్సీ, ఎస్టీ అని రాయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర గృహ నిర్మాణసంస్థ చైర్మన్ మడుపు భూంరెడ్డి, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, గడా ప్రత్యేకాధికారి హన్మంతరావు, జాయింట్ కలెక్టర్ పద్మాకర్, గజ్వేల్ ఆర్డీఓ విజయేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment