సాక్షి టీవీ విలేకరిపై చిందులేస్తున్న మంత్రి కాలవ శ్రీనివాసులు
సాక్షి, రాయదుర్గం (అనంతపురం జిల్లా) : కాలవ శ్రీనివాసులు..సమాచారశాఖ మంత్రి..అంతకుముందు దాదాపు పదిహేనేళ్లు జర్నలిస్టు.. ఇపుడు చూస్తున్నదీ సంబంధిత శాఖే..జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాల్సిన పదవిలో ఉన్న ఆయన..విధి నిర్వహణలో ఉన్న ఓ జర్నలిస్టును పరుష పదజాలంతో దూషించారు. ‘ఏయ్ .. వీడియో తీయొద్దువయ్యా...తమాషా చేస్తున్నావా..? నీ అంతుచూస్తా...నేను అంత మంచివాడిని కాదు’ అంటూ ‘సాక్షి’ టీవీ విలేకరి విష్ణుపై ఊగిపోయారు. ఇక నుంచి తన కార్యక్రమాలకు రావద్దంటూ హూకుం జారీ చేశారు. వివరాల్లోకవి వెళితే..రాయదుర్గం పట్టణంలోని జర్నలిస్టులకు 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కణేకల్లు రోడ్డులో ఇళ్లస్థలాలు ఇచ్చింది. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చాక..పాత పట్టాలు రద్దుచేసి, కొత్తపట్టాలను మంత్రి కాలవ శ్రీనివాసులు పంపిణీ చేశారు.
ఆ తర్వాత ఆ లేఅవుట్‌లో కొంతమంది విలేకరులకు ‘హౌస్‌ఫర్ ఆల్’ పథకంకింద ఇళ్లు మంజూరు చేశారు. ఆ లేఅవుట్‌లో సౌకర్యాలను పరిశీలించేందుకు మంత్రి కాలవ ఆదివారం సాయంత్రం అక్కడికి వచ్చారు. ఇది తెలుసుకున్న సమీపంలోనే ఉన్న ఎంసీఏ లేఅవుట్ మహిళలు తాగునీటి సమస్య చెప్పుకునేందుకు ఖాళీ బిందెలతో మంత్రి వద్దకు వచ్చారు. వారిని పోలీసులు అడ్డగించి.. వలి అనే వ్యక్తితో పాటు ఓ మహిళను మంత్రి వద్దకు పంపించారు. ‘ఏంటయ్యా ఖాళీ బిందెలతో వచ్చారు.. సమస్య చెప్పేందుకు ఒకరిద్దరు రావాలి గానీ ఖాళీ బిందెలతో వస్తావా..? ఆడవాళ్లతో నన్నే అడ్డుకోవాలని చూస్తావా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలను సాక్షి టీవీ రిపోర్టర్ విష్ణు చిత్రీకరిస్తుండగా మంత్రి అగ్గిమీద గుగ్గిలమయ్యారు.. ‘ఏయ్ .. ఎందుకు తీస్తున్నావ్’ అని గదమాయించారు.
సార్ నీటి సమస్య చెబుతున్న విషయాన్ని తీస్తున్నా అని చెబితే ‘తీయొద్దు, ఇక కార్యక్రమాలకు సాక్షి విలేకరులు రావద్దు’ అంటూ హెచ్చరించారు. అంతటితో ఆగకుండా ‘లేనిపోనివి సృష్టిస్తున్నారు, పనికిమాలిన లం.కొ..లు మీడియాలో చేరి జర్నలిజం విలువలు తీస్తున్నారు’ అని ఆగ్రహంతో ఊగిపోయారు. వాడికి ఎవడైనా సపోర్ట్ చేస్తే వారి అంతు కూడా చూస్తా..ఏమనుకున్నారో ఏమో? అంటూ అక్కడే ఉన్న జర్నలిస్టులనూ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment