టీడీపీ అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లను చూస్తే అంతా ఆశ్చర్యపోతారు.ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు జిల్లాలోని మరో ముగ్గురు అఫిడవిట్లలో తప్పులు బయటపడ్డాయి. చంద్రబాబు తను నివాసం ఉంటున్న చిరునామా గుంటూరు జిల్లా ఉండవల్లి అయితే.. కృష్ణా జిల్లాఅడ్వకేట్‌తో నోటరీ తయారుచేయించి తప్పులో కాలేశారు. అయినా సీఎం చంద్రబాబు నామినేషన్‌ని ఆమోదించారు. చంద్రగిరి, తిరుపతి, గంగాధరనెల్లూరు టీడీపీ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో అనేక నిజాలను దాచి పెట్టారు. వారి ముగ్గురి నామినేషన్లు ఆమోదించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వీరు ఎన్నికల్లో పోటీచేసే అర్హత ఉందా? అని మేధావులు ప్రశ్నిస్తున్నారు.
సాక్షి, తిరుపతి: టీడీపీ అధినేత చంద్రబాబు సహా నలుగురు టీడీపీ అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లలో వాస్తవాలు దాచిపెట్టారు. దీంతో వారి నామినేషన్లను ఆమోదించిన అధికారులు ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. కుప్పం టీడీపీ అభ్యర్థిగా సీఎం చంద్రబాబు నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు తాను నివాసం ఉంటున్న ఇంటి చిరునామా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి. అయితే ఆయన నోటరీని మాత్రం కృష్ణా జిల్లాకు చెందిన న్యాయవాది సీతారామ్ చేత తయారుచేయించారు. ఇది నిబంధనలకు విరుద్ధం. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని చంద్రగిరి అభ్యర్థిగా నామినేషన్ దాఖలుచేశారు. ఈయన సమర్పించిన అఫిడవిట్‌లో తనకు సంబంధించిన ఆస్తుల వివరాలన్నీ దాచిపెట్టారు. పాకాల మండలం ఆదెనపల్లిలో ఖాతా నంబర్ 283తో 32 సర్వే నంబర్లలో సుమారు 10 ఎకరాల వరకు భూమి ఉంది. అయితే నోటరీలో చూపించింది కేవలం 8 సర్వే నంబర్లలో ఉన్న భూమి మాత్రమే చూపించారు. పులివర్తి నాని భార్య కె.గానసుధ పేరున 1.30 ఎకరాలు ఉన్నట్లు చూపించా రు. వాస్తవంగా ఆమె పేరునయాదమర్రి మండలం కుక్కలపల్లిలో సర్వే నంబర్ 510/4ఏలో మొత్తం 3.32 ఎకరాల భూమి ఉంది. ఆస్తుల వివరాలను దాచిపెట్టిన చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని పేరున రెండు పాన్ కార్డులు ఉన్నట్లు అఫిడవిట్‌లో చూపిం చారు. నిబంధనల ప్రకారం ఒకే వ్యక్తి రెండు పాన్ కార్డులు ఉండకూడదు. ఆస్తులు కూడా నాని పేరున చూపించారు.
సుగుణమ్మ.. ఇదేందమ్మా...!
తిరుపతి టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే సుగుణమ్మ సమర్పించిన అఫిడవిట్‌లో వాస్తవాలు దాచిపెట్టారు. అఫిడవిట్‌లోని 12వ పేజీలో ఉండాల్సిన మూడు కాలమ్స్ మాయమయ్యాయి. హెచ్‌యుఎఫ్, వారసులు 1, 2, 3 గడులు (కాలమ్స్) పూర్తి చేయాలి. అయితే సుగుణమ్మ సమర్పించిన అఫిడవిట్‌లో అవి కనిపించలేదు. 14వ పేజీలో వివరాలు మాత్రం చూపించారు. హోటల్, కారు, ఎయిర్ కండిషనర్, ఫర్నీచర్స్, మోటార్ వాహనం, ఇతరత్రా చూపించారు. అయితే అవి ఎవరికి చెందినవి అనే వివరాలు పొందుపరచలేదు. ఏడవ గడిలో 6, 7, 8లో ఆస్తులను చూపించారు. అవి ఎవరి అని స్పష్టం చెయ్యలేదు. ఇంకా 550 గ్రాముల బంగారం ఉన్నట్లు చూపిం చారు. అవి కూడా ఎవరివి అనేదానిపై స్పష్టత లేదు. ఇదిలా ఉంటే.. తిరుచానూరు వద్ద సర్వే నంబర్ 255/1బి, 256/1లో 87 సెంట్ల భూమి ఉంది. ఈ భూమిని 2006లో రూ.9,84,905 కొనుగోలు చేసినట్లు చూపించారు. ప్రస్తుతం ఈ భూమి విలువ కేవలం రూ.1,04,400గా చూపించారు. అదే విధంగా సర్వే నంబర్ 254/3లో 35 సెంట్ల భూమిని 2007లో రూ.5, 04, 565 కొనుగోలుచేశారు. ప్రస్తుతం ఆ భూమి విలువ కేవలం రూ.45,500 మాత్రమేనట. సర్వే నంబర్ 256/1లో 21 సెంట్ల స్థలాన్ని 2008లో రూ.6,86,820కి కొనుగోలు చేశారు. ప్రస్తుతం దాని విలువ రూ.25,200గా చూపించారు. సర్వే నంబర్ 251/10ఏలో 3.75 సెంట్ల స్థలాన్ని 2009లో రూ.1,74,640కి కొనుగోలు చేస్తే.. అదే స్థలం ప్రస్తుతం రూ.4,875గా చూపించారు. వాస్తవంగా ఇక్కడ సెంటు స్థలం సుమారు రూ.25 లక్షలు పలుకుతోంది.
సెంటు భూమి లేదు..వ్యవసాయం ద్వారా ఆదాయమట
గంగాధరనెల్లూరు టీడీపీ అభ్యర్థి గుమ్మడి హరికృష్ణ తనకు వ్యవసాయ భూములు లేవని చూపించారు. అయితే వ్యవసాయం ద్వారా రూ.5,88,650 ఆదాయం చూపించారు. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలో ప్లాట్ నంబర్ 153. సర్వే నంబర్ 239/3, 3ఏని చూపించారు. అందులో విస్తీర్ణం, విలువ చూపలేదు. ఇంకా హరికృష్ణ తండ్రి 2014లో ఒక ప్లాట్‌ను బహుమతిగా ఇచ్చారు. ఆ ప్లాటు విలువ అప్పట్లో రూ.9 లక్షలు. ప్రస్తుతం ఆ ప్లాటు మార్కెట్ విలువ చూపలేదు. హరికృష్ణ భార్య భార్గవి టీటీడీ కేంద్ర ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆమె ఇన్‌కంట్యాక్స్ ఏమీ లేదని చూపించారు. వింజం లక్ష్మిరెడ్డి పల్లి గ్రామంలో నివాసం ఉంటున్నట్లు చూపించారు. ఆ నివాసం అద్దెదా? సొంతమా? అనే వివరాలను పొందుపరచలేదు. అఫిడవిట్‌లో కారు ఉందన్నారు. ఆ వాహనాన్ని ఫైనాన్స్‌లో తీసుకున్నారా? నేరుగా డబ్బులిచ్చి కొనుగోలు చేశారా? అనే వివరాలు లేవు. ఇదిలా ఉంటే ‘నో డ్యూస్’ సర్టిఫికెట్స్ ఎక్కడా చూపలేదు. ఈ నలుగురు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో అనేక తప్పులు ఉన్నా రిటర్నింగ్ అధికారులు ఆమోదించడంపై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
చంద్రబాబునాయుడు అఫిడవిట్
Comments
Please login to add a commentAdd a comment