సాక్షి, చెన్నై: తమిళ రాజకీయాల్లో కీలకమైన డీఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ రాజకీయ అడుగులు ఇప్పుడు తీవ్ర ఆసక్తి రేపుతున్నాయి. ఓవైపు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న ఆయన.. మరోవైపు జాతీయ స్థాయిలో థర్డ్‌ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో తాజాగా చెన్నైలో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో థర్డ్‌ఫ్రంట్ దిశగా ఎంతవరకు చర్చలు జరిగాయన్నది తెలియదు. అయితే, థర్డ్‌ఫ్రంట్ ఆలోచనే లేదని, ఎన్నికల ఫలితాల తర్వాత ఏదైనా అంటున్న స్టాలిన్ గురించి ఇప్పుడో హాట్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. తనకు బద్ధవిరోధి అయిన బీజేపీతో చెలిమికి సైతం స్టాలిన్ సిద్ధమవుతున్నట్టు కథనాలు రావడం తమిళ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
బీజేపీతో దోస్తీ దిశగా స్టాలిన్ అడుగులు వేస్తున్నారన్న కథనాలు నేపథ్యంలో ఆయన బీజేపీతో చర్చలు జరిపిన విషయం వాస్తవమేనని ఆ పార్టీ తమిళనాడు చీఫ్ తమిళ సై సౌందరరాజన్ స్పష్టం చేశారు. అటు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని.. ఇటు కేసీఆర్‌తో మంతనాలు జరుపుతున్న స్టాలిన్.. మరోపక్క బీజేపీని కూడా లైన్‌లో పెట్టారన్న కథనాలపై తమిళ రాజకీయాల్లో వాడీవేడి చర్చ జరుగుతోంది. స్టాలిన్ బీజేపీతో ఎందుకు చర్చలు జరిపారు? కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారుకు తగినంత మెజారిటీ రాకపోతే.. ఆయన మద్దతు ఇస్తారా? స్టాలిన్-బీజేపీ చర్చల వెనుక ఆంతర్యం ఏమిటి? అన్నది ప్రస్తుతం రాజకీయ పరిశీలకుల్లో ఆసక్తి రేపుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడితే తప్ప స్టాలిన్ వ్యూహం ఏమిటన్నది స్పష్టంగా తెలిసే అవకాశం లేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి :
మూడో కూటనిపై స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment