సాక్షి, మంగళగిరి : రాజధాని పేరుతో ప్రజల ఆస్తుల్ని దోపిడీ చేసిన చంద్రబాబు వ్యవస్థలతో పాటు మీడియానూ మేనేజ్ చేసి నిజాలు బయటకు రాకుండా తొక్కిపెట్టారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మండిపడ్డారు. రాజధాని కోసం తీసుకున్న భూములను ఎక్కడ తాకట్టు పెట్టారో? ఎంత వడ్డీకి ఎన్ని కోట్లు తీసుకున్నారో అన్ని లెక్కలూ తేలాల్సి ఉందన్నారు. మంగళగిరి మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజధాని పేరుతో తీసుకున్న భూములకు చట్టపరంగా ఇస్తామని చెప్పిన అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు చంద్రబాబు ఇంతవరకూ ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు.
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి తీసుకుంటున్న నిర్ణయాలు రైతులతో పాటు ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చేలా ఉన్నాయని పేర్కొన్నారు. చంద్రబాబు, తీసుకున్న 33 వేల ఎకరాల్లో ఎన్ని ఎకరాల్లో నిర్మాణాలు చేశారో చెప్పాలని సవాల్ చేశారు. కృష్ణా కరకట్టపై నిర్మించిన అక్రమకట్టడాల మీద ఇప్పటికే న్యాయ స్థానం 60 మంది నిర్మాణదారులకు నోటీసులు జారీ చేసిందని, వారంతా న్యాయస్థానానికి సమాధానం చెప్పిన అనంతరం న్యాయస్థానం ఇచ్చే తీర్పు ప్రకారం అక్రమకట్టడాలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment