సాక్షి, అమరావతి: మండలిలో రాజకీయాల కోసం చట్టాలను వాడుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలిలో ప్రజాస్వామ్యానికి చంద్రబాబు వెన్నుపోటు పోడిచారని మండిపడ్డారు. ప్రజలు ఆమోదించిన, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మండలిలో అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రజల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనం కోసం మండలిని ఉపయోగించుకుంటున్నారని ధ్వజమెత్తారు. సీఎం వైఎస్ జగన్ రాజకీయం చేయాలనుకుంటే ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టేవారని.. రాజకీయాలు ఫేర్‌గా ఉండాలని ఆయన అభిప్రాయపడుతున్నారని పేర్కొన్నారు. సీఎం అనుకుంటే ఆర్డినెన్స్ ద్వారా అయినా చట్టం తెచ్చేవారన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ముందుకు వెళ్తుంటే టీడీపీ రాజకీయం చేస్తోందన్నారు. మండలి రద్దు నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించాలని చెవిరెడ్డి కోరారు.
ఆయన ప్రయోజనాల కోసమే..
ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయాలన్ని ఆయన ప్రయోజనాల కోసమేనని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాసనమండలిలో చంద్రబాబు, టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరును ఎండగట్టారు. చంద్రబాబు పాలనలో దాడులు,అసమానతలు, ప్రాంతాలు, కులాల మధ్య వైషమ్యాలు చూశామని.. రాష్ట్ర విభజనకు ఆయన లేఖ ఇచ్చారని దుయ్యబట్టారు. హోదా విషయంలో అనేకసార్లు యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధి కోసం వికేంద్రీకరణ బిల్లు తెస్తే..మండలిలో టీడీపీ సభ్యులు ఎలా ప్రవర్తించారో అందరికి తెలుసునన్నారు. మండలి రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. ఇంగ్లీష్ మీడియం, ఎస్సీ,ఎస్టీలకు ప్రత్యేక కమిషన్‌ల బిల్లులను కూడా చంద్రబాబు అడ్డుకున్నారని మేరుగ నాగార్జున నిప్పులు చెరిగారు.
మండలిని అడ్డం పెట్టుకుని..
మండలిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు తన బినామీలను కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధాని పేరుతో చంద్రబాబు భారీ దోపిడీకి ప్రయత్నించారని మండిపడ్డారు. మండలిలో సైంధవుల్లా టీడీపీ వ్యవహరిస్తోందన్నారు. యనమల వేసుకునే సూటు,బూటు కూడా ప్రభుత్వ సొమ్మేనని విమర్శించారు. ప్రభుత్వ సొమ్మును దోపిడీ చేసిన చరిత్ర యనమలది అని దుయ్యబట్టారు. శాసనసభ్యులను ఆంబోతులతో పోల్చిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment