విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య
సాక్షి, తడ (నెల్లూరు): అబద్ధపు హామీలు ఇచ్చి 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు ఒక్క హామీనీ సక్రమంగా నెరవేర్చక పోవడంతో వచ్చే ఎన్నికల్లో ప్రజలు చిత్తుచిత్తుగా ఓడిస్తారనే భయంతోనే చంద్రబాబు తన నోటికి పదును పెట్టారని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆరోపించారు. మత్స్యకార గ్రామాల పర్యటనలో భాగంగా గురువారం బీవీపాళెం పంచాయతీలోని పాతకుప్పం, కొత్తకుప్పం, పూడి పంచాయతీ, పూడి కుప్పం, తడ పంచాయతీ తడకుప్పంలో ఎమ్మెల్యే పర్యటించి కుప్పాల్లోని సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కిలివేటి విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రజల సమస్యలు గాలికి వదిలి కేవలం తెలుగు తమ్ముళ్ల ధనదాహం తీర్చేందుకు నడుం బిగించారన్నారు. ఈ క్రమంలో గ్రామదర్శిని పేరుతో దోపిడీలకు ఉన్న అవకాశాలు, వనరులను వెతికేందుకు తమ్ముళ్లను గ్రామాల మీదికి పంపారు తప్ప సమస్యలు తెసుకునేందుకు కాదని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు.
గతంలో తొమ్మిదేళ్లు తాజాగా నాలుగేళ్లుగా పాలన సాగిస్తూ ప్రజల సమస్యలన్నీ తొలగిపోయాయని ప్రకటనలు ఇస్తున్న సీఎం గ్రామాల్లో ఇంకా ఏం సమస్యలు మిగిలి ఉన్నాయని గ్రామాల్లో పర్యటిస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు ఎంతో సమయం వేచి చూసి ముఖ్యమంత్రిని చూస్తే వారి సమస్యలు తెలుసుకోకుండా దాడికి, ధూషణలకు దిగడం సరైన పద్ధతి కాదని ఎమ్మెల్యే హితవు పలికారు. సీనియర్ నాయుకుడినంటూ గొప్పలు చెప్పుకునే బాబుగారు ఓట్లు అడిగే సమయంలో చూపిన వినయ విధేయతలు అధికారం దక్కి పాలన సాగించే సమయంలో చూపకపోవడమే సీనియారిటీనా అని ప్రశ్నిం చారు. మత్స్యకారులు తమను ఎస్‌టీల్లో చేర్చాలని కోరుతూ విశాఖపట్టణంలో శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే వారిపై సాక్షాత్తు ముఖ్య మంత్రే కఠినంగా, దురుసుగా వ్యవహరిస్తే వారు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని పేర్కొన్నారు. టెంట్లు పీకేయండి లేకుంటే తాటతీస్తా అంటూ మత్స్యకారులపై గూండా తరహాలో హూంకారాలు చేయడం మత్స్యకారులు మరవలేదని ఆయన అన్నారు.
తమ సమస్యలు తెలిపేం దుకు వెళ్లిన నాయీ బ్రాహ్మణులను తోకలు కత్తిరి స్తాననడం, ఎవరైనా ఎస్సీల్లో పుట్టాలని కోరుకుంటారా అంటూ కులాలను తక్కువ చేసి మాట్లాడటం బాబు అహంభావానికి, ఓటమి భయానికి నిదర్శనాలని కిలివేటి అన్నారు. ఆయన ప్రజల తోకలు కత్తిరించడం అటుంచి ప్రజలు ఆయనకు గుండు కొట్టే సమయం ఆసన్నమయిందని ఎమ్మె ల్యే తెలిపారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మత్స్యకారులందరికీ తేడాలు లేకుండా వేట నిషేధ సమయంలో జీవన భృతి రూ.10వేలు అందిస్తానని చెప్పడంతో హడావిడిగా పులికాట్ జాలర్లకు రూ. 4వేలు భృతి ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని కిలివేటి అన్నారు. పులికాట్ మత్స్యకారులను మెరైన్ మత్స్యకారుల తరహాలో అన్ని సౌకర్యాలు అందేలా చట్టం తెచ్చే ఆలోచనలో జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నట్టు కిలివేటి తెలిపారు. పులికాట్ పూడిక, ముఖద్వారాల పూడిక వల్ల పులికాట్ ఎండిపోతూ మత్స్య సంపద లభించక జాలర్లు వేట సాగని స్థితిలో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని ఆయన అన్నారు.
సరస్సులో 75 శాతం మనకు ఉన్నా చేపలు, రొయ్యలు లేక 17 కుప్పాల జాలర్లు పూట గడవని స్థితిలో ఉన్నారని అన్నారు. తమిళనాడులో 25 శాతం సరస్సుని ఆధారంగా చేసుకుని కేవలం నాలుగు కుప్పాల జాలర్లు నివసిస్తున్నా అక్క డి ప్రభుత్వం ఏటా రెండు, మూడు కోట్లు ఖర్చు చేసి పూడికతీత తీయిస్తూ ఉండటంతో మత్స్య సంపద పుష్కలంగా లభిస్తూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఇప్పటికే వేట కోసం తమి జాలర్లతో గొడవలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న జా లర్లను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని అన్నారు. ఎమ్మెల్యే వెంట పార్టీ తడ మండల అధ్యక్షుడు కే రఘు, తిరుపతి పార్లమెంటరీ జాయింట్ సెక్రటరీ ఎస్ జయచంద్రారెడ్డి, నాయకులు కే ఆర్ముగం, కే శేఖర్‌బాబు, టీ కోదండం, జీ రత్నం, కే మురుగన్, కే వాసుమొదలి, పరమశివంరెడ్డి, తిరుమలైరెడ్డి, నత్తం శ్రీని వాసులు, ఎస్ కృష్ణారెడ్డి, శివకుమార్, బీ మోహన్, కుమార్, మణికంఠ, అనీష్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment