సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి నేనే సీఎం. తెలంగాణలో కాంగ్రెస్ బతికే పరిస్థితి లేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీయే రాజీనామా చేశారు. అందరం కలిసి బీజేపీకి వెళ్తే.. భవిష్యత్తులో తెలంగాణకు నేనే సీఎం అవుతా’’ అంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఓ కార్యకర్తతో ఫోన్‌లో మాట్లాడిన మాటలు లీకయ్యాయి. ఆయన పార్టీ మారుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఓ అభిమాని ఆయనకు ఫోన్ చేశారు. మీరు గెలవడం కోసం తాము ఎంతో కష్టపడ్డామని, ఇలా పార్టీ మారడం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య సాగిన సంభాషణ ఫోన్‌లో రికార్డయింది.
తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యమ్నాయం బీజేపీయే అంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన ప్రకటన ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలతో ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తారని ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు వాటికి మరితం బలం చేకూరుస్తున్నాయి. దీంతో ఆయన పార్టీ మారుతున్నారని ఇప్పటికే నిర్ధారణ కాగా, ముహూర్తం కూడా ఖరారైందని ఆయన సహచరులు చెబుతున్నారు. రాజగోపాల్ రెడ్డి వెంట పార్టీని వీడి పోయే వారు ఎందరు..? కాంగ్రెస్‌లో కొనసాగే వారు ఎందరు..? ఆయన పార్టీ మారడం వల్ల ఏయే నియోజకవర్గాల్లో ఎంత ప్రభావం పడుతుంది..? అన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment