సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి బాహుబలా.. లేక సముద్రంలో నీటి బిందువా అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిల మధ్య ఆసక్తికర చర్చ జరగింది. రేవంత్ రెడ్డి రాజీనామాపై కాంగ్రెస్సే స్పందించాలని, రేవంత్ అందరికీ సినిమా చూపించాడని, ఇపుడు కాంగ్రెస్‌కి చూపిస్తారని జీవన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌లో చేరడం అంటే అక్రమ సంబంధం పెట్టుకోవడమేనంటూ వ్యాఖ్యానించారు. దీంతో ‘అక్రమ సంబంధం పునాదుల మీద పుట్టిన పార్టీ టీఆర్‌ఎస్. అది ఒక కిచిడి పార్టీ. అమరావతికి పోయి టీడీపీతో సంబంధాలు పెట్టుకున్న పార్టీ టీఆర్‌ఎస్’అంటూ సంపత్ తిప్పికొట్టారు. టీఆర్‌ఎస్‌కు ముందుంది ముసళ్ల పండగ అంటూ వ్యాఖ్యానించిన సంపత్.. అలంపూర్‌లో తన మీద పోటీ చేయడానికి టీఆర్‌ఎస్‌కు అభ్యర్థికే దిక్కు లేదని, రాష్ట్రమంతా వెతికినా తన మీద పోటీకి ఎవరు దొరకరని అన్నారు. అలంపూర్‌లో తనకు తానే పోటీ అని, తన మీద గెలిచే సత్తా టీఆర్‌ఎస్‌కు లేదని సవాల్ చేశారు.
గడ్డం ఎప్పుడు తీస్తావన్నా?
ఉత్తమ్‌తో.. ఎర్రబెల్లి సరదా సంభాషణ
తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. లాబీల్లో తనకు ఎదురైన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిని.. ‘గడ్డం ఎప్పుడు తీస్తావ్ అన్నా’.. అని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. దీనికి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ.. 2019లో ఎలాగూ అధికారంలోకి వస్తాం గనుక అప్పుడు గడ్డం తీసేస్తా అని సమాధానం ఇచ్చారు. ‘చాలా కూల్‌గా ఉన్నావేంటి..’అని ఉత్తమ్ తిరిగి ఎర్రబెల్లిని అడిగారు. ‘నా టెన్షన్లన్నీ తీరిపోయాయి.. ఇప్పుడు ఆ టెన్షన్లు మీకు మొదలయ్యాయి..’అంటూ ఎర్రబెల్లి చమత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment